* ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలను విడుదల చేసిన హమాస్
* ప్రతిగా 90 మంది పాలస్తీనియన్లను వదిలిన టెల్‌అవీవ్
* ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా, ఖతర్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం గాజాలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకే ఒప్పందం అమలు కావాల్సి ఉండగా.. ముగ్గురు మహిళా బందీల పేర్లను హమాస్ వెల్లడించలేదన్న కారణంగా మూడు గంటలు ఆలస్యమైంది.
తమ వద్ద బందీలుగా ఉన్న రోమి గోనెన్ (24), ఎమిలి దమారి (28), డొరోన్ స్టెయిన్‌బ్రెచర్ (31)ను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించడంతో ఒప్పందం అమలైంది. ఆరువారాల పాటు కాల్పులు నిలిపేయనున్నారు. తొలి దశ కాల్పుల విరమణలో తమ చెరలోని బందీలుగా ఉన్న 98 మందిలో 33 మందిని హమాస్ విడుతల వారీగా విడుదల చేయనుంది.
ఇందుకు ప్రతిగా దాదాపు 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను, నిర్బంధంలో ఉన్న గాజావాసులను ఇజ్రాయెల్ వదిలిపెట్టనుంది. తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను గాజా సిటీలోని అల్ స్కేర్ దగ్గర రెడ్‌క్రాస్‌కు హమాస్ మిలిటెంట్లు అప్పగించారు. బందీలను రెడ్‌క్రాస్ తమకు సురక్షితంగా అప్పగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఈ ముగ్గురు బందీలకు బదులు టెల్‌అవీవ్ 90 మంది పాలస్తీనా ఖైదీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.