calender_icon.png 20 November, 2024 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంజేకు విముక్తి

27-06-2024 12:00:00 AM

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆయన స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత అయిదేళ్లుగా ఆయన బ్రిటన్‌లో జైలు జీవితం గడుపుతున్నారు. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చు కోవడంతో అసాంజే విడుదలకు మార్గం సుగమమైంది. అయితే అమెరికా వెళ్లడానికి అసాంజే అంగీకరించకపోవడంతో ఆస్ట్రేలియా సమీపంలో అమెరికా అధీనంలో ఉన్న ఉత్తర మరియానా ఐలాండ్స్‌లోని సైపస్  కోర్టులో విచారణ జరిగింది.

బుధవారం దాదాపు మూడు గంటలపాటు జరిగిన విచారణలో అసాంజే ఒప్పందం  ప్రకారం గూఢచర్య చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన  రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని తాను  విశ్వసిస్తున్నానంటూ పరోక్షంగా తాను చేసిన చర్యలను సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించానని, భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే  ఈ పని చేసిన ట్లు వెల్లడించారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నట్లు తెలిపారు.

దీంతో కేసు విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జస్టిస్ రమోనా వి మంగ్లోనా అసాంజే నేరాంగీకారానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌లో గడిపిన అయిదేళ్ల నిర్బంధ కాలాన్ని జైలుశిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పారు. బ్రిటన్, అమెరికాలోని ఆస్ట్ట్రేలి యా రాయబారులతో కలిసి ఆయన తన సొంత దేశమయిన ఆస్ట్రేలియాకు బయలుదేరడంతో కథ సుఖాంతమైంది. అసాంజే విడుదలపై ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా 1901 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలవుతున్న అసాంజే కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వారికి వికీలీక్స్ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇరాక్ ,అఫ్గానిస్థాన్‌లలో అమెరికా సైన్యం పాల్పడిన తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన పత్రాలను లీక్ చేయడంతో 2010లో అసాంజే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ సంస్థ అమెరికా రక్షణ రంగ రహస్యాలకు సంబంధించిన లక్షలాది పత్రాలను విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు ‘రాయిటర్’ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియోలు వంటివి ఇందులో ఉన్నాయి. అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91 వేల పత్రాలను, ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4 లక్షల రహస్య పత్రాలను  విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజేపై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో అసాంజే 2010 అక్టోబర్‌లో బ్రిటన్‌లో అరెస్టయ్యారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యా రు. అయితే ఆయనను స్వీడన్‌కు అప్పగించాలని లండన్ కోర్టు ఆదేశించింది. దీనిపై  సుప్రీంకోర్టులో అపీల్ చేసినా లాభం లేకపోయింది. దీంతో ఆయన లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో రాజకీయ ఆశ్రయం పొందా రు. 2009లో ఆ ఆశ్రయం కూడా రద్దయింది. అనంతరం బ్రిటన్ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్‌లో ఉండడంతో శిక్ష పూర్తయ్యాక కూడా జైలులోనే ఉన్నారు. జైలులో ఉండగానే  2022లో ఆయన  న్యాయవాది అయిన స్టెల్లాను వివాహం చేసుకున్నారు. అసాంజేను విచారణ కోసం తమ దేశానికి రప్పించడానికి అమెరికా చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చివరికి అసాంజే అమెరికాకు వెళ్లకుండానే   స్వదేశానికి చేరుకోవడం గమనార్హం.