12-04-2025 06:37:47 PM
నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కార్పోరేటీకరణ, కాషాయీకరణ కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం..
పాల్వంచ (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం–దేశాన్ని రక్షించుకుందాం నినాదంతో షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో శనివారం పాల్వంచలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి నిరసన ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... మూడోవ సరి అధికారం చేపట్టిన రోజు నుంచి రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి అనేక మంది యువకులు, దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారనీ, కులం, మతం కన్నా దేశం మిన్న అని భావించారు. కాని నేటి పాలకులు అధికారం కోసం కులాన్ని, మతాన్ని వాడుకొంటూ ప్రజల ఐక్యతను విచ్చిన్నం చేస్తున్నారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణ లాంటి విషయంలో అందరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు చేస్తూ మైనార్టీలను అభద్రతాభావానికి గురిచేస్తున్నారునీ, దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయిన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ, గవర్నర్ల జోక్యం పెరిగి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఆరోపించారు. దక్షిణ- ఉత్తర రాష్ట్రాల మధ్య వివక్షత ప్రదర్శిస్తూ, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే చర్యలు చేపడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అని అన్నారు.
సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి 10 ఏండ్ల కాలంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారు విమర్శించారు. దేశంలో రోజురోజుకు దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాలపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని వీటికి కారణం కేంద్ర ప్రభుత్వ మతతత్వ ఆలోచనలేనని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతుల ధరల గ్యారెంటీ చట్టం తీసుకొని రాకుండా వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొని వస్తున్నారునీ, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కార్పోరేటీకరణ, కాషాయీకరణ కుట్రలు చేస్తున్నారని, పోరాడి సాధించుకొన్న కార్మికుల హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారునీ ఈ తరుణంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ సిపిఐ ప్రజాసంఘాల నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, చెన్నయ్య, మడుపు ఉపేంద్ర చారి, వైఎస్ గిరి, వేములపల్లి శ్రీను, SA రెహమాన్, బీవీ సత్యనారాయణ, కోరే కృష్ణ, కాసర్ల రామారావు, వర్క్ అజిత్, బిక్కులాల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.