calender_icon.png 9 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి కలిసొచ్చిన ఉచితాలు

09-02-2025 01:52:56 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ రాజధానిలో బీజేపీ కాషాయ జెండాను ఎగరేసింది. 27ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుంది. సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించడానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. 

* ఢిల్లీలో బీజేపీని విజయతీరాలకు చేర్చడం వెనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ప్రధానంగా పని చేసిందని చెప్పొచ్చు. బడ్జెట్ సందర్భంగా రూ. 12లక్షల వరకూ ఆదాయ పన్నును మినహాయించనున్నట్టు సీతారామన్ ప్రకటించారు. మధ్యతరగతి వేతన జీవులకు ఇది భారీ ఊరటనిచ్చింది. ఢిల్లీలో ఎక్కువగా ఉండే మధ్యతరగతి ఓటర్లను ఈ అంశం ప్రభావితం చేసి, ఈసారి బీజేపీవైపు మొగ్గు చూపేలా చేసిందనే వాదన బలంగా వినిపిస్తుంది. 

* ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని సుమారు 40లక్షల మంది పూర్వాంచలి ఓటర్లు బీజేపీకి అండగా నిలిచినట్టు తెలుస్తుంది. 20 స్థానాల్లో వీళ్ల ఆధిపత్యం ఉండటంతో వీరి మద్దతు ఉన్నవారే దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ బీహార్ మిత్రపక్షాలను, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రంగంలోకి దింపింది. ఫలితంగా వీళ్ల మెజార్టీ ఓట్లు బీజేపీకే పడ్డట్టు తెలుస్తుంది. 

*ఈసారి బీజేపీ ప్రధానంగా స్థానిక సమస్యలపై దృష్టిసారించింది. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం విఫలమైందనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. బీజేపీ ఇచ్చిన ఈ హామీని అక్కడి ప్రజలు విశ్వసించినట్టు ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. 

* ఉచితాలపై బీజేపీ తన వైఖరిని మార్చుకోవడం ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చేలా చేసింది. ఉచిత పథకాలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాలను ప్రకటించి విజయం సాధించింది. అదే సక్సెస్ ఫార్ములాను ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఉపయోగించింది. 

* ఢిల్లీలో 71లక్షల మంది మహిళా ఓటర్లు ఉంటారు. వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. అందులో ‘మహిళా సమృద్ధి యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం వంటివి ఉన్నాయి. బీజేపీ ఇచ్చిన ఈ హామీలను అక్కడి మహిళలు విశ్వసించారు. 

* బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. అందులో భాగస్వామిగా ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఐక్యంగా పోటీ చేయకుండా విడివిడి పోటీ చేశాయి. అది బీజేపీకి బాగా కలిసొచ్చింది.