పెద్దపల్లి మార్కెట్లలో ఉచితంగా కూరగాయలు
పండుగ చేసుకున్న ప్రజలు
పెద్దపల్లి, (విజయక్రాంతి): ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లలో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. కానీ పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో మాత్రం కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. నిజమా... అవును మీరు వింటున్నది నిజమే మంగళవారం పెద్దపెల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో ఉదయం వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఇంకేముంది పట్టణ ప్రజలు ఈరోజు పండుగ చేసుకున్నారు. ఇంకేముంది కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని పట్టణమంతా వ్యాపించడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి కూరగాయలను తీసుకొనివెళ్ళారు.
విషయం ఏంటంటే కూరగాయల మార్కెట్ లో హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య ఘర్షణ రావడంతో రిటైల్ వ్యాపారులు కోపంతో ఉచితంగానే కూరగాయలు ప్రజలకు అందజేశారు. ఇరు వర్గాల మధ్య ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మద్దని నిబంధనలు ఉండగా, అది అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు వారు ప్రతి రోజు అమ్ముతునారని ఆగ్రహించిన రిటెయిల్ వ్యాపారులు మంగళవారం వారి పై ఆగ్రహంతో కూరగాయలన్నీ ఉచితంగా మార్కెట్కు వచ్చిన ప్రజలకు పంచిపెట్టారు. దీంతో ఈరోజు ఉదయం మార్కెట్ కి వచ్చిన ప్రజలు మాత్రం ఉచితంగా వచ్చిన కూరగాయలు తీసుకొని ఆనందంగా వెళ్లిపోయారు దీంతో పెద్దపల్లి పట్టణంలో ఈ విషయంపై జోరుగా చర్చించుకుంటున్నారు.