మానవత్వం చాటుకుంటున్న మహనీయుడు
ఇల్లెందు (విజయక్రాంతి): స్వతహాగా అతనొక వికలాంగుడు.. జీవనోపాధి, కుటుంబ పోషణకు ఆటో డ్రైవర్ బతుకు ప్రయాణం సాగిస్తున్నాడు. తన వికలాంగ అవస్థలు చవి చూస్తున్న అతను తనలాంటి దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. ఆచరనాత్మాకంగా దివ్యంగులతో పాటు గర్భిణీ స్త్రీలకు తన ఆటోను ఉచిత ప్రయాణ సేవా కేంద్రంగా మార్చేశాడు. అందుకే అతను ఏజెన్సీలొ ఆపద్బాంధవుడు, అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కేంద్రంగా 20 ఏళ్లుగా తన ఆటో ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు.
అతని పేరు మహమ్మద్ ముజాహిద్. 45 ఏళ్ళ వయసున్న ఆయనకు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన ఈ స్థితిలో వుంటూ కూడా ఒక మంచి సంబంధం చూసి కుమార్తె వివాహం చేశాడు. కుమారుడిని ప్రస్తుతం డిగ్రీ చదివిస్తున్నాడు. వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి ఫోన్ చేసినా వెంటనే స్పందించి బాధితుల ఇంటికెళ్లి మరీ ప్రయాణ సౌకర్యం కల్పించడం సామాన్య విషయం కాదు. అందుకే రెండు దశాబ్దాలుగా ఆటో ముజాహిద్ ఈ ప్రాంతంలో అందరి అభిమానం పొందుతున్నాడు. తన తుది శ్వాస వరకు ఈ సేవను కొనసాగిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో ముజాహిద్ చెప్తున్నాడు. వికలాంగుడిగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వివరించారు.