ఉచిత పథకాలు ప్రజలకు తాత్కాలిక ఊరట కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో గతి తప్పుతుంది. ప్రజలు జనాకర్షక పథకాల ఉచ్చులో పడకుండా, కట్టుదిట్టమైన ఆర్థిక విధానాలతో బీజింగ్ అమలు చేస్తున్న కార్యక్రమాలే చైనాను ప్రపంచంలో దుర్భేద్య శక్తిగా తీర్చిదిద్దాయనడంలో సందేహం లేదు. భారత్ పాలకుల్లోనూ ఈ తరహా ప్రాప్తకాలజ్ఞత మొగ్గ తొడగాలి. అన్ని స్థాయిల్లోనూ ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తున్న పరిణామమిది. సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికలను పునఃనిర్వచించుకోవాల్సిన అవసరమూ ఉంది.
శ్రీధర్ వాడవల్లి
‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దా నాలను అన్నింటినీ తు.చ. తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు’ అంటారు అమెరికన్ హాస్యరచయిత విల్ రోగర్. ఈ నీతిసూత్రం ఈతరానికి చెందిన మన రాజకీయ నాయకులకు అనేకమందికి వర్తిస్తుంది. ‘నరం లేని నాలుక మండు వేసవిలోనైనా సరే వారిచేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది’ అన్న మాటనూ పలువురు అగ్రశ్రేణి నాయకులే నిజం చేస్తున్నా రు. దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక పథకాల పేరిట వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇంకా, ఒకడుగు ముందుకేసి ఏకంగా నగ దు బదిలీల విధానాలనే అవలంభిస్తున్నాయంటే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో ఊహించుకోవచ్చు. దాదాపు అన్ని పార్టీ లూ ఇదే బాటలో నడుస్తుండటం విచారకరం.
అనుచిత పోకడ ప్రమాదకరం
పేదలను అన్ని విధాలుగా ఆదుకొని, వారిని స్వావలంబన బాట పట్టించడమే సంక్షేమరాజ్య భావన అన్న విషయంలో అనుమానం లేదు. దేనినైనా ఉచితంగా అమర్చి పెట్టడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? ఈ రకమైన ఏర్పాటు దేశాభివృద్ధికి ఏ మేరకు ఉపయుక్తకరం? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. లోకో భిన్నరుచిః సహజమే. కానీ, సమాజంలోని ఏ వర్గాన్నీ వదలకుండా ప్రతి ఒక్కరికీ ఉచితాన్ని అలవాటు చేస్తే దానివల్ల దేశ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కదా! అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ, అంతూపొంతూ లేని అవినీతి, అపరిమిత జనాకర్షక పథకాల బారిన పడి వెనెజులా (దక్షిణ అమెరికా ఉత్తర తీర ప్రాంతంలోని దేశం) నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అధికారమే పరమావధి అనుకొంటే దేశం భవిష్యత్తులో ఏమై పోయినా ఫరవాలేదా? జనాకర్షక పథకాల యావలో పడితే దేశ ఆర్థికమే మొత్తానికి పుట్టి మునిగే ప్రమాదాన్ని వెనెజులా ఉదాహరణ సూచిస్తోంది.
అన్నదాతలను ఇలా ఆదుకోవాలి
దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. జాతి జనుల ఆకలి తీర్చే అన్నదాతల మౌలిక సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. అందుకోసం రైతన్నలకు బహుళ కోణాల్లో అక్కరకొచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేయవచ్చు. నాణ్యమైన విత్తనాల లభ్యతపై శ్రద్ద, ఎరువులు క్రిమిసం హారక మందుల స్థిరీకరణ, పండిన పంట ను గిట్టుబాటు ధర వచ్చేవరకు భద్రపరిచే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు ప్రభుత్వాలే నిర్వహించేటట్లు ఏర్పాటు చేయాలి. ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లు, బిందుసేద్య పరికరాలపై సబ్సిడి, నకీలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ఉత్పత్తిపై ఉక్కుపాదం మోపడం, నాణ్యమైన విద్యుత్‌ని ఆందించటం, గిట్టుబాటు ధరకు గట్టి హామీని ఇవ్వడం ప్రభుత్వాల ప్రాథమిక విధి.
మేధోవలసలను ఆపలేమా?
ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యను ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం ఉచితంగా అందించాలి. వృత్తి, ఉన్నత విద్య, పరిశోధన రం గాల్లో ఫీజుల పరంగా రాయితీ ఇస్తూ అం దరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఆ రకంగా మేధోవలసలకు అడ్డుకట్ట వేయా లి. కొత్త ఆలోచనలు, నవకల్పనలను పరీక్షించుకునే వేదికలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలి. సృజనాత్మక ఆలోచనలతో వెళ్ళే ప్రతి విద్యార్థీ సరికొత్త మేధతో బయటికొచ్చే ఆచరణాత్మక వేదికలుగా వాటిని మలచాలి. మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు విస్తృత ప్రోత్సాహం కల్పించాలి. ఏక గవాక్ష అనుమతి విధానం ద్వారా ఈ పరిశ్రమలకు కొత్త ఊపిరి పొయ్యాలి.
పేదలకు ప్రభుత్వ వైద్యసేవలు
పౌరులందరికీ వైద్య ఆరోగ్య సదుపాయాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి. అందుకోసం దేశంలో ఆరోగ్య రంగాన్ని దాదాపుగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంచాలి. ఈ క్రమంలో ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థలను కొన్ని పరిమితులతో సంపన్న వర్గాలకు అందుబాటు లో ఉంచవచ్చు. విద్య, ఆరోగ్య అవసరాలను ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చ గలిగితే దేశం సహజంగానే అభివృద్ధిబాట పడుతుంది. చక్కటి విజ్ఞానం, సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడే మానవ వనరులు ఏ దేశానికైనా తరగని సిరులు!
ఈ చేత్తో డబ్బు, ఆ చేత్తో ఓట్లు
ప్రజల విద్యాభివృద్ధి, వారి ఆరోగ్య పరిరక్షణపై పూర్తి శ్రద్ధ పెడితే- మరే రకమైన తాయిలాలతోనూ అవసరం లేకుండానే అద్భుతమైన అభివృద్ధి కళ్లముందు సాక్షాత్కరిస్తుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బును ఇలా ఈ చేత్తో ఇచ్చి, అలా ఆ చేత్తో ఓట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోకో’ ఎత్తులకు సుప్రీంకోర్టు నిరు డు జులైలోనే లక్ష్మణరేఖలు గీసింది. వాగ్దా న కర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్న దానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికీ జవాబులు లేవు. అభివృద్ధి, సంక్షేమం కలిసి సాగితేనే ప్రగతి రథం ముందుకు సాగుతుంది.
నిరుద్యోగ భృతి పరిష్కారం కాదు
ఉపాధి సమస్యను పరిష్కరించి, యువతను జీవితంలో నిలదొక్కుకొనేలా చేయడానికి బదులు నిరుద్యోగ భృతిని ఇస్తామనడమన్నది నిర్మాణాత్మక పరిష్కారం కాదు. చదువులు ముగించుకొని ఇప్పుడిప్పుడే ఉపాధి అన్వేషణలో పడుతున్న కొత్తతరం యువతకు ఈ ధోరణి సరైన సంకేతాలు పంపదు. సంపదను సృష్టించకుండా, ప్రజలను స్వావలంబనకు చేరువ చేయకుండా- ఈ తరహా ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోవడం వల్ల రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడం తప్ప మరో ప్రయోజనం వుండదు.
(రచయిత సెల్: 9989855445)