calender_icon.png 10 October, 2024 | 6:46 AM

మరో నాలుగేళ్లపాటు ఉచిత బియ్యం

10-10-2024 02:31:47 AM

2028 డిసెంబర్ వరకు గరీబ్ కల్యాణ్ పథకం పొడిగింపు

ఇందుకోసం రూ.17,082 కోట్లు కేటాయింపు

సరిహద్దు గ్రామాల అనుసంధానానికి రూ.4.4 వేల కోట్లు

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఆహార భద్రత కోసం ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని మరో నాలుగేళ్ల పాటు కేంద్రం పొడిగించింది. ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం, ఆహార ధాన్యాలు అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది.

రక్తహీనత, శరీరంలో మైక్రో న్యూట్రియెంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యంగా ఫోర్టిఫైడ్ రైస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ఈ కార్యక్రమానికి పూర్తిగా కేంద్ర నిధులనే వెచ్చిస్తున్నారు. దీనికి సంబంధిత పథకాలను సైతం 2028 డిసెంబర్ వరకు పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం కోసం నాలుగేళ్లలో రూ.17,082 కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ పండగల సీజన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం అమలు ద్వారా దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

దీనిని నీతి ఆయోగ్ పూర్తిస్థాయిలో పరిశీలన చేసిందని, సాధారణ బియ్యంతోనే వీటిని తయారు చేస్తారని తెలిపారు. 2019 మధ్య దేశంలో నిర్వహించిన ఆరోగ్య సర్వేలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందని, అందరిలో ఈ లోపం కనిపించిందని కేంద్రమంత్రి తెలిపారు. 

సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ      

గరీబ్ కల్యాణ్ యోజనతో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారి టైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలికాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది.

పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల కనెక్టివిటీకి రాజస్థాన్, పంజాబ్‌లో 2,280 కిలోమీటర్లు కొత్త రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ రూ.4,406 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. గ్రామాలను హైవేలతో కలపడం ద్వారా సరిహద్దుల్లో అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.