హెచ్‌ఎంఆర్ ఎండీకి యువజన సంఘాల వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, పెయిడ్ పార్కింగ్ నిర్ణయా న్ని ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ, పీవైఎల్, ఏఐఎస్‌ఎఫ్ తదితర యువజన సంఘాల నాయకులు కోరారు. శుక్రవారం హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షడు కోట రమేష్, కేఎస్ ప్రదీప్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ.. అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ వసతి కల్పించాలన్నారు. పార్కింగ్ ఫీజులను శాశ్వతంగా రద్దు చేయకపోతే సెప్టెంబరు 1న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నాగోల్ వద్ద పెయిడ్ పార్కింగ్ బోర్డు!
సెప్టెంబర్ 15 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయబోతున్నట్లు ఏర్పాటు చేసిన బోర్డు శుక్రవారం రాత్రి దర్శనమిచ్చింది. గతంలోనే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ నాగోల్ వద్ద పెయిడ్ పార్కింగ్ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.