calender_icon.png 31 October, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచితంగా కాలేయ మార్పిడి చికిత్స

18-07-2024 02:41:04 AM

  • తెలంగాణ ప్రభుత్వ చొరవ 
  • ప్రైవేటు దవాఖానల్లో రూ.30 - 40 లక్షల ఖర్చు 
  • డా. మధుసూదన్ బృందాన్ని అభినందించిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): కాలేయ మార్పిడి.... అత్యంత ఖరీదుతో కూడుకున్న శస్త్రచికిత్స. సాధారణంగా ప్రైవేటు హాస్పిటల్స్‌లో కాలేయ మార్పిడి కోసం రూ. 30 నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.  అయినా ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. కానీ హైదరాబాద్, ఉస్మానియా వైద్యులు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నిరుపేద బాలునికి ఉచితంగా కాలేయ మార్పిడి చేసి ప్రభుత్వ వైద్యంపై పేదలకు భరోసా కల్పించారు.

“నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అనే పరిస్థితి ఉన్న తరుణంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ఉస్మానియా వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డా. మధుసూదన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఉచితంగా, విజయవంతంగా కాలేయ మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. డా. మధుసూదన్ బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. 

కాలేయ గొట్టాలు లేని స్థితిలో...

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన గుణశేఖర్, అమల దంపతుల మూడేళ్ల కుమారుడు చౌహాన్ ఆదిత్యకు పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయం వైఫల్యం సమస్యలు ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చూపించినా ఫలితం లేకపోయింది. ఎదుగుదల లోపించడంతో పాటు పొట్ట ఉబ్బి, బలహీనంగా తయారయ్యాడు. కాలేయ వైఫల్యంతో రక్తం గడ్డకట్టక రక్త విరేచనాలకు గురై బాలుడి పరిస్థితి మరింత దిగజారింది. కాలేయ గొట్టాలను తెరిచేందుకు అవసరమయ్యే ‘కసాయ్’ ఆపరేషన్ చేసినా విజయవంతం కాలేదు. దీంతో చివరకు ఉస్మానియాలో అయితే బాగవుతుందని చెబితే బాలుడిని ఇక్కడికి తీసుకువచ్చారు. డా. మధుసూదన్ నేతృత్వంలోని ఉస్మానియా వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది సహా మొత్తం 17 మంది బృందం 18 గంటలపాటు కష్టపడి బాలునికి శస్త్రచికిత్స చేశారు. 

ప్రైవేటులో శస్త్ర చికిత్స చేస్తే రూ. 30 లక్షలు చెల్లించాల్సిందే...

దాదాపు 10 మందికి పైగా వైద్యులు కనీసం 18 నుంచి 48 గంటల పాటు కష్టపడి కాలేయ మార్పిడి చికిత్స చేస్తారు. ఇందుకు గాను మందులు, పరికరాలు, ఓటీ, ఇతర ఖర్చులు అన్నీ కలిపి సుమారు రూ. 30 నుంచి రూ. 40 లక్షలకు పైగానే అవుతుంది. ఇంత ఖర్చు చేసినా చాలా కేసుల్లో ఫలితం సానుకూలంగా ఉండదు. ఈ ఖరీదైన వైద్యాన్ని తెలంగాణలో ఉచితంగా అందిస్తున్న ఏకైక హాస్పిటల్ ఉస్మానియా. ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 12 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఈ కాలేయ మార్పిడి చేస్తున్నారు.

ఉస్మానియా వైద్యులకు అభినందనలు

కాలేయ మార్పిడి అంటేనే ఎంతో ఖరీదైన శస్త్రచికిత్స. ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్ స్థాయి వసతులను కల్పించడం వల్లే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మూడేళ్ల బాలుడు చౌహాన్ ఆదిత్య కాలేయ మార్పిడి విజయవంతంగా చేసినందుకు ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందిస్తున్నా. ఇప్పటికే ఉస్మానియాలో 30 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం గొప్ప విషయం.

ఘదామోదర రాజనర్సింహ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉస్మానియాకు వచ్చారు

కాలేయ వైఫల్యంతో బాధ పడుతున్న బాలుడు ఆదిత్యను తల్లితండ్రులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉస్మానియాకు తీసుకువచ్చారు. బాలుడి కాలేయం గొట్టాలు మూసుకుపోవడంతో అప్పటికే కసాయ్ సర్జరీ చేశారు. అయినా ఫలితం లేదు. కాలేయ వైఫల్యంతో బాలుడి రక్తం గడ్డకట్టడం లేదు. కాలేయ వైఫల్యంతో శరీరానికి అందాల్సిన ఏ, ఈ, డీ, కే విటమిన్లు సరిగ్గా అందక బాలుడి ఎదుగుదల కూడా ఆగిపోయింది. ఆరోగ్యంగా ఉన్న తల్లి నుంచి 110 గ్రాముల కాలేయం తీసుకుని బాలుని కాలేయ మార్పిడి సర్జరీ చేశాం. 3 రోజుల పాటు సాగిన శస్త్రచికిత్స విజయవంతం అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. బాలునికి జీవితాంతం నెలనెలా ఉస్మానియాలోనే ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు చేస్తాం.

  డా. మధుసూదన్, హెచ్‌ఓడీ, గ్యాస్ట్రో విభాగం, ఉస్మానియా