calender_icon.png 17 October, 2024 | 4:03 AM

గాంధీలో ఉచితంగా ఐవీఎఫ్ సేవలు

17-10-2024 01:12:50 AM

త్వరలో మరో 4 నగరాల్లో విస్తరించేందుకు యోచన

దశల వారీగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటు

సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఉపశమనం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రాష్ర్టంలో యువ దంపతులకు సంతానలేమీ సమస్య తలనొప్పిగా మారింది. ప్రతీ వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ దవాఖానలలో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటళ్లలో రూ.లక్షల్లో వసూలు చేస్తుండటంతో ఎంతోమంది మానసికంగా, ఆర్థికం గా కుంగిపోతున్నారు.

మారిన జీవన విధానాలతో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రా ష్ర్టంలో తొలిసారి ప్రభుత్వ దవాఖానలలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి వచ్చా యి. గాంధీ హాస్పిటల్‌లోని ఫర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్ సౌకర్యాన్ని ఆరోగ్యశాఖ మం గళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

సంతానలేమి సమస్యతో బాధ పడుతున్న దంపతులకు ఇది శుభవార్త అని వైద్యులు అంటున్నారు. లక్షలు ఖర్చయ్యే ఐవీఎఫ్ సేవలు ఇకపై ఉచితంగా అందనున్నాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిం చేందుకు కసరత్తు చేస్తున్నారు.

గత గవర్నమెంట్ హయాంలో హడావుడి..

ప్రభుత్వ దవాఖానలలో ఫర్టిలిటీ సెంట ర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభు త్వం ప్రకటించింది. 2023 వరకూ గాంధీలో ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత అక్టోబర్‌లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సెంటర్‌ను హడావుడిగా ప్రారంభించారు. కానీ అక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయలేదు.

ఇందుకు కావాల్సిన రీఏజెంట్స్, మెడిసిన్ ఇవ్వకపోవడం, ఎంబ్రయాలజిస్ట్ నియమించకపో వడమే ఇందు కు కారణం. నెల రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ హాస్పిటల్‌లో పర్యటించగా అధికారులు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను రిక్రూట్ చేయాలని, అవసరమైన ఎక్విప్‌మెంట్, మెడిసిన్ కొనుగోలు చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు.

సమస్య తీవ్రత దృష్టా రాష్ర్ట వ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులో తీసుకొ చ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గాంధీ తో పాటు పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని హాస్పిటళ్లలోనూ సెంటర్ల ఏర్పా టు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. ఈ సెంటర్లు ప్రారంభించాక, మిగిలిన ఉమ్మడి జిల్లా కేంద్రాలకూ సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇన్‌ఫర్టిలిటీ సమస్య అంటే...

కనీసం ఏడాది పాటు లైంగిక జీవితం గడిపినా గర్భం దాల్చకపోతే ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. మన దేశంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే ఇదివరకు సంతానలేమికి మహిళలను మాత్రమే కారణంగా చూపేవారని, ఇప్పుడు పెరిగిన అవగాహన కారణంగా సమస్య ఎవరిలో ఉందో తెలుసుకోవడం కోసం పురుషులు కూడా ముందుకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

జనాలకు ఉన్న ఈ సమస్య కొంత మంది డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. ప్రజలనుంచి దండుకునేందుకు వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. ప్రభుత్వ దవాఖానలలో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది.

ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ.50 నుంచి 80 వేల ఖరీదులో పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు రూ.3 నుంచి 6 లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా సగం మందికి ఫలితం దక్కడం లేదు. . 

ఐవీఎఫ్ అంటే... 

ఐవీఎఫ్ అంటే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్. ఇది కృత్రిమ గర్భధారణ చికిత్స. సంతానోత్పత్తి సమస్యలున్న జంటలకు సంతానం కలిగేలా ఐవీఎఫ్ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ ప్రక్రియలో అండం, శుక్ర కణాలను శరీరం వెలుపల ప్రయోగశాలలో కలిపి ఎంబ్రియో (పిండం)ను తయారు చేసి ఆ తర్వాత మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

ఈ క్రమంలో ఒవారియన్ స్టిమ్యులేషన్ (స్త్రీ శరీరం ఎక్కువ అండాలు ఉత్పత్తి చేసేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం), స్త్రీ నుంచి అండా ల సేకరణ, పురుషుడి నుంచి శుక్ర కణాలను సేకరించి వాటిని శుద్ధిచేయడం, ప్రయోగ శాలలో ఎంబ్రియోను సృష్టించి దాని అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఎంబ్రియోను స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి గర్భధారణకు ప్రయత్నిస్తారు. ఎంబ్రియోను ప్రవేశపెట్టిన తర్వాత 10 నుంచి 14 రోజుల తర్వాత గర్భం ఏర్పడిందో లేదో పరీక్షిస్తారు. 

పైసా ఖర్చు లేకుండా ఐవీఎఫ్ సేవలు..

దామోదర్ రాజనర్సింహ, వైద్యఆరోగ్య శాఖ మంత్రి

గత ప్రభుత్వం ఐవీఎఫ్ సేవలను ప్రారంభించినట్లు ప్రచారం చేసుకుంది. కానీ ఒక్కరికి కూడా ఐవీఎఫ్ సేవలు అందించలేదు. ఈ అంశం మా దృష్టికి రావడంతో గాంధీ హాస్పిటల్‌లో నిబంధనల మేరకు ఐవీఎఫ్ సెంటర్‌ను తీర్చిదిద్దాం. వెంటనే ఎంబ్రియాలజిస్ట్ సహా సిబ్బందిని నియమించాం.

సంతానలేమితో బాధపడుతున్న జంటలు లక్షలకు లక్షలు అప్పులు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ ఇప్పుడు ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా సేవలు అందిస్తాం. త్వరలో పేట్లబుర్జ్ హాస్పిటల్ సహా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లోనూ ఐవీఎఫ్ సేవలు విస్తరిస్తాం.