చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ లయన్స్ క్లబ్ ద్వారా పేదవారికి, వృద్దులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని క్లబ్ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి అన్నారు. ఆదివారం 26 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి 22 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించామన్నారు. ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ద్వారా ఎంతో మంది వృద్ధులకు కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత మందికి కంటిచూపు తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధులకు తగు జాగ్రత్తలు చెప్పి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మల సాగర్, బెల్లంపల్లి నాగరాజ గౌడ్, తుమ్మ శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.