- పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
- టీచర్లే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు
- ప్రజా ప్రభుత్వానికి ఇంకో అవకాశమివ్వాలి
- ఎల్బీ స్టేడియంలో జరిగిన టీచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ౩౦ వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్‌ను అమలు చేసేందుకు, పారిశుద్ధ్యకార్మికులను నియమించేందుకు నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయానికి, రైతులకు, పేదవర్గాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నప్పుడు, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఎందుకు ఉచిత విద్యుత్ అమలు చేయకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల కొత్తగా పదోన్నతులు పొందిన దాదాపు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇక నుంచి పాఠశాలలకు కరెంట్ కష్టాలుండవన్నారు. గతంలో బిల్లులు చెల్లించకుంటే బడుల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించేవారన్నారు. మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులను కల్పించేందు కు చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలల పారిశుధ్య బాధ్యత కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని, ఏడాదికి రూ.79 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ భవిష్యత్ మీచేతిలోనే..
‘తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని ఈ క్షణం నన్ను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని’ చెబుతానని సీఎం అన్నారు. విద్యార్థుల భవిష్యత్ మీ చేతిలోనే ఉందని, వారిని జీవితంలో తీర్చిదిద్దాలన్నారు. పేదవర్గాలు చదువుకునే పాఠశాలల అభివృద్ధికి ప్రతీ టీచర్ కృషి చేయాలన్నారు. పేద విద్యార్థులను డాక్టర్లుగా, కలెక్టర్లు, ఇంజనీర్లుగా, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలుగా తీర్చిదిద్దాలని సూచించారు. తానూ కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలో చదువుకొనే ఈ రోజు సీఎం అయ్యా యని గుర్తు చేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదం డ్రుల భవిష్యత్ మీ చేతిలో పెట్టానన్నారు.
విద్యా, ఉద్యోగుల పరిస్థితి దిగజారింది
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే విద్యావిధానం బాగుపడుతుందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గౌరవం పెరుగుతుందనుకున్నా మని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్, హరగోపాల్, చుక్కా రామయ్య లాంటి విద్యావంతులకు గౌరవం దక్కుతుందని భావించామని, కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత పదేళ్లలో తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌లో విద్యకు 10 శాతం కేటాయించాలని భావించినప్పటికీ, హామీల అమలు దృష్ట్యా 7.3 శాతం అంటే రూ.21 వేల కోట్లకు పైగా నిధులనే కేటాయించినట్లు తెలిపారు.
మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని సీఎం అన్నారు. సీఎంగా కేజ్రీవాల్ మూడుసార్లు గెలిచారని, ఢిల్లీ బస్తీల్లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోనే ఆయన గెలిచారని సీఎం తెలిపారు. ‘నాకు కూడా మరోసారి అవకాశం ఇస్తారా?’ అని టీచర్లను కోరారు. ప్రజా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం మీకు వస్తుందన్నారు. ‘మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు... మీకేం కావాలో ఇచ్చే బాధ్యత మాది..పేద పిల్లలకు బాగా చదువు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి’ అని కోరారు.
2 లక్షల అడ్మిషన్లు తగ్గాయి
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. అదే 10వేల ప్రైవేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా? అని ప్రశ్నించారు. మీరంతా ఉన్నత చదువులు చదివి, పోటీ పరీక్షలు పాసై, శిక్షణ పొంది ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారితో చదువులు చెప్పిస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. దీనికి అనేక కారణాలుండొచ్చని వివరించారు.
టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు
‘టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేం దుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని, భాషా పండితుల సమస్యలను పరిషరిష్కరించినట్లు తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.
పాఠశాల స్థాయి నుంచే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని టీచర్లను సీఎం సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన తెలిపారు. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోందని, అందుకే ముచ్చర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్క్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నట్లు వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి మొక్కలను ఏరేద్దాం..
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని సీఎం తెలిపారు. ఏడవ తరగతి చదివే పిల్లలు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తులసి వనంలోని గంజాయి మొక్కలను ఏరి వేస్తున్నామని, వారు ఎంతటి పెద్దోళ్లయినా ఉపేక్షించడం లేదన్నారు.
ఇది టీచర్ల పండుగ: ప్రొఫెసర్ కోదండరామ్
ఈ రోజు టీచర్ల పండుగని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జీవితంలో ఒక్కసారైనా ప్రమోషన్ తీసుకోకుండా రిటైర్డ్ అవుతానేమోననే ఆవేదన టీచర్లలో ఉండేదన్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదన్నారు. 30 వేల మందికి గతంలో ఎన్నడూ లేనంతగా, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి, పదోన్నతులను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. గతంలో ఇలాంటి సమావేశాలు ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు.
టీచర్లు మీ వంతుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా పనిచేయాలన్నారు. మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మిగిలిన ఎస్జీటీలకు, కామన్ సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డు సమస్యను ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు వస్తుందన్నారు. సీఎస్ శాంతి కుమారి కూడా మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇవీ నర్సింహారెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, మదన్‌మోహన్, టీచర్ సంఘాల నేతలు పాల్గొన్నారు.