calender_icon.png 19 January, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్

06-09-2024 05:00:00 AM

  • బిల్లులను రాష్ర్ట ప్రభుత్వమే చెల్లిస్తుంది 
  • జీవో కాపీని విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
  • రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు లబ్ధి
  • వారంలో డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తాం
  • 6వేలకుపైగా పోస్టులతో మరో డీఎస్సీ 
  • గురుపూజోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందించనున్నట్లు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ మేరకు ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించిన జీవో కాపీని స్వయంగా విడుదల చేశారు.

అనంతరం ఉపాధ్యాయులను ఉద్దే శించి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉత్తర్వులతో రాష్ర్టంలోని 27,862 ప్రభుత్వ విద్యాలయాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులను రాష్ర్ట ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన వెల్లడించారు. విద్యతో పాటు గురువులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. గత పది సంవత్సరాల పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు లేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల ఆకాంక్షలను అర్థం చేసుకున్న ప్రజాప్రభుత్వం.. 40 వేల మంది ఉపాధ్యాయులకు పారదర్శకంగా బదిలీలు చేయడంతో పాటు 24 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని పేర్కొన్నారు. 

టీచర్ల సమస్యలు పరిష్కరిస్తం..

గురువులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. సమాజం అభివృద్ధి చెందాలన్నా నాగరికతతో ముందుకు వెళ్లాలంటే విద్య అవసరమన్నారు. గురువుల ఆలోచనలను ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని విధానపరమైన నిర్ణయాలు రూపొందిస్తుందని వెల్లడించారు. ప్రగతిశీల రాష్ర్టంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పి, మంచి మానవ వనరులున్న సమాజ నిర్మాణం దిశగా గురువులు విద్యాబోధన చేయాలని కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2007లో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మీడియం విద్యా బోధన చేయాలని ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. అభ్యుదయ భావాలున్న గురువుల స్ఫూర్తితో ఈ రాష్ర్టం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ర్టంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు గర్విస్తున్నానని భట్టి చెప్పారు. 

వారంలో డీఎస్సీ ఫలితాలు..

ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసిందని డిప్యూటీ సీఎం చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఈ రాష్ర్టంలో డీఎస్సీ నిర్వహించలేదని, దీనివల్ల ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదన్నారు. దీంతో తాము అధికారంలోకి రాగానే 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామన్నారు. వారంలో డీఎస్సీ ఫలితా లను వెల్లడిస్తామని తెలిపారు.

అవసరాలకు అనుగుణంగా సిలబస్ లేదు..

ఇప్పటివరకు పరిశ్రమలకు పనికొచ్చే సిలబస్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమల అభివృద్ధి కూడా వెనకడుగు పడిందన్నారు. పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను అభివృద్ధి చేయాలని ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ర్టంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ర్టంలో 63 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేసి పరిశ్రమలలో పనిచేయడానికి ఉపయోగపడే విధంగా అధునాతనాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నట్లు చెప్పారు. పది సంవత్సరాలుగా రాష్ర్టంలో ఉన్న యూనివర్సిటీలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు.

ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 300 కోట్లు కేటాయించామ న్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతుల కోసం రూ. 100 కోట్లు కేటా యించినట్లు తెలిపారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువుల గురించి మాట్లాడుతున్న క్రమంలో నిజాం కాలేజీలో తనకు ప్రొఫెసర్ కోదండరాం విద్యా బోధన చేశారని చెప్పారు. కోదండరాం జన్మదినోత్సవ సందర్భంగా పుష్ప గుచ్చమందించి పట్టు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు           తెలిపారు. 

వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ : మంత్రి పొన్నం  

పదేండ్లుగా విద్యావ్యవస్థకు సరైన న్యాయం జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీచర్ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలను కల్పించామన్నారు. ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బంది అవుతుందని రూ.1100 కోట్లతో 25 వేల పాఠశాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో తగ్గు తోందన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు భవనాలు నిర్మిస్తు న్నామన్నారు. టీచర్లు హక్కులతో పాటు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని రకాల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవార్డులు పొందుతున్న ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకొని ఇతర ఉపాధ్యాయులు ముందుకు కదలాలని పేర్కొన్నారు. విదేశీ విద్య, ఇతర రాష్ట్రాల్లోని యూనివర్శిటీల్లో చదివేవారికి వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావు మాట్లాడుతూ మారుతున్న సమాజా నికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారాలని సూచించారు. విద్యార్థులకు కొత్త విషయాలను నేర్పి కొత్త తరాన్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు.

ఆ తర్వాత గురుపూజోత్సవం కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన 150 మంది టీచర్లు, అధ్యాపకులకు మంత్రి పొన్నం అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. విద్యార్థ్ధనులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి  చైర్మన్ ప్రొఫె సర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకట రమణ, మహమూద్, ఉన్నతాధికారులు శ్రీదేవసేన, శృతి ఓజా, వెంకట నర్సింహారెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

6 వేల పోస్టులతో మరో డీఎస్సీ

రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారు చేసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణను స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు అప్పగించామన్నారు. ఆదర్శ పాఠశాల కోసం ప్రభుత్వం  రూ. 667 కోట్లను వెచ్చించిందని వెల్లడించారు. ప్రభుత్వ బడులలో స్వీపర్లు లేకపోవడం వల్ల గురువులే పాఠశాలలను క్లీన్ చేసుకోవాల్సిన దుస్థితి గత పాలనలో నెలకొందన్నారు. ఆ పరిస్థితి పోవాలని ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ.136 కోట్లను విడుదల చేశామని చెప్పారు.