calender_icon.png 25 October, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్!

29-07-2024 02:24:00 AM

  1. బడి నుంచి యూనివర్సిటీ దాకా 
  2. త్వరలో సర్కారు ఉత్తర్వులు 

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం ప్రకటించే అవకాశం

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటికే గృహావసరాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న సర్కారు విద్యాసంస్థకు కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను అందించేలా త్వరలోనే ఉత్త ర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందివ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

ఈ విషయాన్ని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్కారు బడుల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలతోపాటు ప్రభుత్వ విశ్వవిద్యాల యాలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తీరనున్న కరెంట్ కష్టాలు

విద్యాసంస్థలకు విద్యుత్ ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. సరిపడా నిధులు, గ్రాంట్స్ అందకపోవడం తో అరకొర నిధులతో విద్యాసంస్థల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. కరెంట్ బిల్లులు చెల్లించకుంటే కొన్ని సందర్భాల్లో విద్యాసంస్థలకు విద్యుత్ సరఫారాను సైతం నిలిపివేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తే ఇకపై ఈ కరెంట్ కష్టాలు తప్పనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 30,036, 146 డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 407, 12 యూనివర్సిటీలతోపాటు మరికొన్ని గురుకుల పాఠశాలలు, డిగ్రీ, ప్రభుత్వ పీజీ కాలేజీలు వెయ్యి వరకు ఉంటాయి.

వీటన్నింటికీ ఉచిత విద్యుత్ అందించేందుకు ఎంత బడ్జెట్ అవుతుందనే వివరాలను సంబంధిత శాఖ నుంచి తెప్పించుకొని ఇప్పటికే ఓ నివేదికను కూడా అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్‌లు ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం. విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించడం లేదా ఆయా శాఖలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ప్రతి నెలా బిల్లులు అందులోంచి కట్టుకునేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యాసంస్థలకు అందించే ఉచిత విద్యత్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం ప్రకటన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు

విద్యాసంస్థలు సంఖ్య

పాఠశాలలు 30,036

డిగ్రీ కాలేజీలు 146

జూనియర్ కాలేజీలు 407

యూనివర్సిటీలు 12

గురుకుల పాఠశాలలు, డిగ్రీ, ప్రభుత్వ పీజీ కాలేజీలు వెయ్యి వరకు ఉంటాయి.