రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 10 (విజయక్రాంతి): బాలికలకు 18 ఏళ్ల వరకు ప్రభుత్వాలు ఉచితవిద్య అందించాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ మాజీ చైర్‌పర్సన్ శాంతా సిన్హా పేర్కొన్నారు. బాలికల చదువుతోనే సమాజంలో నెలకొన్న బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు తదితర సమస్యలను పరిష్కారమవుతాయన్నారు.
ఉచిత ఉన్నత విద్యకు ప్రభు త్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బేగంపేట సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కేంద్రం లో తెలంగాణ ఆడ పిల్లల సమానత్వ సమా ఖ్య రాష్ట్ర యువ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఎంవీ ఫౌండేషన్, తెలంగాణ ఆడ పిల్లల సమానత్వ సమాఖ్య సంయు క్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ మెగాసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే కల్యాణలక్ష్మీ లాంటి పథకాలను బాలికల విద్య కోసం కూడా అమలు చేయాలన్నారు. కార్యక్రమం లో తెలంగాణ విద్య కమిషన్ మెంబర్ కే జ్యో త్స్న శివారెడ్డి, ఎంవీ ఫౌండేషన్ మేనేజింగ్ చైర్మన్ అండ్ ట్రస్టీ ఎంఆర్ విక్రమ్, ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి, కోఆర్డినేటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాణ్యమైన విద్యతోనే బాలికలకు న్యాయం అనే వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ఆడ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా .. 5 గురు సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఎన్నుకున్నారు. వీరిలో మానస (శంకర్‌పల్లి), జ్యోతి (వికారాబాద్), వైష్ణవి (ఆత్మ కూర్), వెన్నెల (హైదరాబాద్), స్పందన గట్టు (గద్వాల) ఉన్నారు.