calender_icon.png 12 April, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం

04-04-2025 10:32:12 PM

సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

కాటారం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సన్నబియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కొండపర్తి పద్మకు సన్నబియ్యం అందించి పధకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం మన తెలంగాణ అని తెలిపారు. గొప్ప మానవీయ పథకాన్ని ప్రారంభించి మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు తినే సన్నబియ్యం నిరుపేదలకు అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రం అంతటా  ఏప్రిల్ 1 నుండి పిడిఎస్ లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమయ్యిందని తెలిపారు గతంలో వినియోగదారుల ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డుబియ్యం పంపిణీ ఫలితంగా పునఃవిక్రయం మరియు మళ్లింపు చర్యలు జరిగేవని దాని వల్ల కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని తెలిపారు. ప్రజలు  ఎక్కువగా సన్నబియ్యం ఇష్టపడుతారని, వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి  సన్నబియ్యం వినియోగాన్ని పెంచడానికి మరియు దొడ్డు బియ్యం రీ సైక్లింగ్ ను అరికట్టడానికి చౌక దుకాణాల ద్వారా  సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం దాదాపు రూ.2858 కోట్లు అవుతుందని అయినా నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వంలో రేషన్ డీలర్లు బాగస్వాములని, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని, మీ సమస్యలను సానుకూలంగా  పరిష్కారిస్తామని,  లబ్ధిదారులకు క్రమం తప్పకుండా సన్న బియ్యం ఇవ్వాలని సూచించారు. నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు  సన్నరకం ధాన్యానికి 2 వేల కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.  ప్రతి వ్యక్తికి 6 కిలోలు చొప్పున పంపిణీ చేస్తున్నామని నలుగురున్న కుటుంబానికి నెలకు దాదాపు 1400 రూపాయలు ఆదా జరుగుతున్నట్లు తెలిపారు.  మంథని నియోజకవర్గంలో 41,045 మంది కార్డుదారులున్నారని ఈ పథకం అమలుతో 1,17,069 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.  రానున్న 15 రోజుల్లో ఇల్లు లేని నిరుపేదల జాభితా తయారు చేయాలని, అధికారులు అర్హులైన వారికి మంజూరు చేయాలని అన్నారు. నిలువ నీడలేని నిరుపేదలనే ఎంపిక చేయాలని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. 

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పధకానికి దరఖాస్తు చేయడానికి ఈ  నెల 14 చివరి తేదీ అని తెలిపారు.   మంజూరు ఉత్తర్వులు జారీ తదుపరి యూనిట్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుని ఆదాయ వనరులు సమకూర్చుటకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని అయి నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐయితా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాద్, పౌర సరఫరాల డిఎం రాములు, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, కాటారం డివిజన్ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.