25-02-2025 07:44:11 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
అపోహలు, భయాలు తొలగించేందుకు కృషి..
పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి..
27 న కంపెనీ ప్రతినిధులతో సమావేశం..
పటాన్ చెరు (విజయక్రాంతి): ప్రజలలో చికెన్ తినడంపై వచ్చిన అపోహలు భయాలు తొలగించేందుకు.. పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు అతి త్వరలో పటాన్ చెరు నియోజకవర్గంలో చికెన్ మేళా ఏర్పాటు చేసి.. ఉచితంగా చికెన్ వంటకాలు, గుడ్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చికెన్ వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. బర్డ్ ఫ్లూ సమస్య మూలంగా నెల రోజులుగా కొనుగోళ్ళు లేక తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి రోజు నష్టాలను ఎదుర్కొంటూ.. జీతాలు చెల్లించలేక.. నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే పటాన్ చెరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఇటువంటి భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసులు నమోదు కాని ప్రాంతంలో నిర్భయంగా చికెన్ ఉత్పత్తులు తినవచ్చని అన్నారు. ఈనెల 27వ తేదిన పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గం వ్యాప్తంగా చికెన్ ఉత్పత్తులతో చికెన్ మేళా ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.