07-03-2025 01:41:44 AM
హైటెక్ సిటీ కేంద్రంగా నకిలీ కాల్‌సెంటర్
అమెరికా పౌరులకు ఎర
ఎక్సిటో సొల్యూషన్స్ పేరిట నిర్వహణ 63 మంది అరెస్ట్
వివరాలు వెల్లడించిన టీజీసీఎస్‌బీ డైరెక్టర్ షికాగోయల్
హైదరాబాద్, సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాసభ్యులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీ ఎస్‌బీ) పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్‌సిటీ పట్రికానగర్‌లో ‘ఎక్సిటో సొల్యూష న్స్’ పేరిట గల కాల్‌సెంటర్ ఎండీ చందా మనస్విని సహా, అందులో పనిచేస్తున్న 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులతో కలిసి టీజీసీఎస్‌బీ డైరెక్టర్ షికాగోయల్ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైటెక్‌సిటీలోని ఎక్సిటో సొల్యూషన్స్ అనే నకిలీ కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ అమెరికా పౌరు లు, ఎన్‌ఆర్‌ఐలకు ఫోన్‌చేసి పేపాల్ అనే సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి వారి ఖాతా వివరాలను సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. అందుకోసం ఐబీమ్, ఎక్స్ లైట్ సాఫ్ట్‌వేర్‌లను వాడుతున్నట్లు తెలిపారు. వారి నుంచి 63ల్యాప్‌టాప్‌లు, 52సెల్‌ఫోన్లు, 27ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
బెంగుళూరు, ముంబై, గుజరాత్ సహా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ కాల్ సెంటర్ ఏవైనా మోసాలకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జడ్డూ బాయ్ సహా ఇతర నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 1930నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.
దుబాయ్, అమెరికా నుంచి డాటా సేకరణ
ఈ కేసులో ప్రధాన నిందితుడు గుజరాత్‌కు చెందిన కైవన్‌పటేల్ రూపేశ్‌కుమార్ అలియాస్ జడ్డుబాయ్ దుబాయ్‌లో ఉండే తన సోదరుడు విక్కీ, ఆజాద్ ద్వారా అమెరికాలోని పేపాల్‌లోని వినియోగదారుల వివరాలను సేకరించి పంపుతున్నట్లు సైబర్‌క్రైమ్ అధికారులు గుర్తించారు.
ఎక్సిటో సొల్యూషన్స్ ఎండీ చందా మనస్విని(హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహించే కాల్ సెంటర్ లో పనిచేసేవారు అమెరికా యాసలోనే ఇంగ్లిష్‌లో మాట్లాడటంతో నమ్మిన పలువురు ఖాతా వివరాలను పంపించడంతో వారి ఖాతా ల నుంచి నిందితులు డబ్బులు డ్రా చేస్తూ మోసం చేస్తున్నారు. కాల్‌సెంటర్‌లో పనిచేసేవారు సదరు అమెరికా పౌరుల నుంచి మెయిల్ ద్వారా వివరాలు పొందాక జడ్డూబాయ్, రాహు ల్ అలియా స్ ప్రతీక్, మనస్విని, టీం లీడర్లు సంజూ, జేమ్స్, ప్రవీణ్ బాధితుల ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసే పనిని పూర్తి చేస్తారు.
కాల్‌సెంటర్‌లో జాబ్ పేరిట ఉద్యోగుల నియామకం
సోషల్‌మీడియా ద్వారా ప్రకటనలతో కాల్‌సెంటర్‌లో పనిచేయాలనుకునే వారిని ఎక్సిటో సొల్యూషన్స్ కంపెనీలో నియమించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాల్‌సెంటర్‌లో పనిచేసేవారిలో ఎక్కువ మంది అస్సాం, నాగాలాం డ్, మణిపూర్, బీహార్, పశ్చిమ బెంగాల్, ముం బైకి చెందినవారిగా గుర్తించారు.
వారందరికీ నిర్వాహకులు ఒకే హాస్టల్‌ను కేటాయించడం గమ నార్హం. కాల్‌సెంటర్ ఉద్యోగుల్లో దాదాపు 20 మంది యువతులున్నట్లు గుర్తించారు. వీరందరూ హాస్టల్ నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు సంస్థ బుక్ చేసిన వాహనాల్లోనే వెళ్లేవారని దర్యాప్తులో గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరంతా నిర్వాహకులు ఇచ్చిన డాటాలో ని అమెరికా పౌరులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించేవారు.