calender_icon.png 30 January, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసకారి కాంగ్రెస్!

29-01-2025 01:05:36 AM

  1. స్థానిక ఎన్నికల స్టంట్.. ‘రైతుభరోసా’
  2. తర్వాత పథకాన్ని బంద్ పెట్టేందుకు కుట్ర
  3. వందశాతం రుణమాఫీ పూర్తయిందని నిరూపించండి
  4. నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా..
  5. నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నల్లగొండ, జనవరి 28 (విజయక్రాంతి): రైతుభరోసా పథకం కేవలం ఎన్నికల స్టంట్.. అని, ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టేందుకు కుట్ర పన్నుతున్నదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ ఆర్ ఆరోపించారు. ఇది మోసకారి ప్రభుత్వమని, ప్రజలెవరూ కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘రైతు మహాధర్నా’లో ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సాఆర్.. రైతుబంధంటే కేసీఆర్’ అని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డికి పెట్టుబడిసాయం పథకం నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు కేసీఆర్ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. కానీ.. ఇప్పుడు కొందరు మంత్రులు ‘కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేసిం డు ?’ అని సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలన లో రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు.

ధాన్యం ఉత్ప త్తిలో నల్లగొండ జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిపామని వెల్లడించారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని ఎస్సారెస్పీ స్టేజ్ 2, ఎన్నెస్పీ టెయిల్ లాండ్  ద్వారా పంటలకు సాగునీరు అందించామని వివరిం చారు.

కాంగ్రెస్ నేతల్లా తాము రైతుబంధుపై గప్పాలు కొట్టుకోలేదని, రైతులపై ప్రేమతో ఏకంగా 11 సార్లు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించామని, రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేశామని గుర్తుచేశారు.

రుణమాఫీ 25శాతమైనా  కాలేదు..

రుణమాఫీ పేరిట రాష్టప్రభుత్వం రైతులను మోసం చేసిందని, వాస్తవానికి 25 శాతం రుణాలైనా మాఫీ కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్ నేతలు నూటికి నూరుశాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

ఈ సవాల్‌ను తాను గతంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ విసిరానని, కానీ.. ప్రభుత్వ పెద్దలెవరూ సవాల్‌కు స్పందించలేదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను రైతులు, ప్రజలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.17,500 చొప్పున రైతుభరోసా బాకీ పడిందని, రైతులు ప్రభుత్వం ముక్కుపిండి మరీ ఆ మొత్తాన్ని వసూలు చేయాలన్నారు. రుణమాఫీ పథకానికి తొలుత రూ.49,500 కోట్లు అవసరమని చెప్పిన, ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.12 వేల కోట్లకు ఎందుకు కుదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు రాష్ట్రప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి జిల్లాకు ఏం చేశారు ?

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు ఏం మేలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇదే క్లాక్ టవర్ సెంటర్‌లో సమావేశం పెట్టి తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకే బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాను పోలీసులు అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తారు. నల్లగొండలో సభ పెట్టుకుంటామంటే మంత్రి కోమటిరెడ్డికి అంత భయమెందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే కలగని ట్రాఫిక్ ఇబ్బందులు, నల్లగొండలో బీఆర్‌ఎస్ ధర్నాకు కలుగుతుందా? అని నిలదీశారు.

‘రాష్ట్రప్రజలు బర్రె అని నమ్మి ఓటేస్తే.. అది కాస్త దున్నపోతైంది..’ అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై దాడి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

మహాధర్నాకు అనుమతించిన హైకోర్టుకు ఈ సందర్భంగా తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. ధర్నా అనంతరం ఎంజీయూ విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా  అడిగి తెలుసుకున్నారు.

రైతుమహా ధర్నాలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి,  కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్, గ్యాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు. 

ఏడాది పాలన.. ఎడతెగని వంచన:  మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైందని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల వేళ రైతులకు అలవి కాని హామీలిచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు.

రైతు సమస్యలపై గళమెత్తుతున్న వారిని ప్రభుత్వం అణచివేస్తున్నదని, అన్నదాతలు ప్రభుత్వంపై స్వచ్ఛందంగా పోరాటం ప్రారంభించారని, విపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ వారికి మద్దతుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల ఉడుత ఊపులకు బీఆర్‌ఎస్ భయపడదని, ఆకు రౌడీలు గులాబీ సైన్యాన్ని ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌దేనని, అందుకే ప్రజలు పదేండ్లు తమ పార్టీకి పట్టంకట్టారన్నారు. సాయుధ పోరాటానికి జీజం వేసిందే నల్లగొండ రైతాంగమని, వారి స్ఫూర్తితో తాము రాష్ట్రప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు.

కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు తాము ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు.

నల్లగొండ కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌కు ఏమాత్రం పోటీ కాదని, వారికి సమాధానం చెప్పేందుకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలే చాలా ఎక్కువని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టి ధర్నాలను అడ్డుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

దొంగల చేతివాటం

బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా హడావిడిలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఎన్జీ కళాశాల, క్లాక్ టవర్ సెంటర్ వద్ద వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. జనసందోహంలో ఉన్న ఆరుగురి మెడల్లో నుంచి బంగారు గొలుసులు, పలువురి చేతి నుంచి సెల్‌ఫోన్లు లాక్కొని పరారయ్యారు. బాధితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.