- రైతుల నుంచి తక్కువ ధరకు విక్రయం
- కొనుగోలు కేంద్రాల్లో దర్జాగా అమ్మకం
- అధికారుల ఆధ్వర్యంలోనే మోసాలు!
- ఖమ్మం జిల్లాలో అక్రమార్కుల దందా
ఖమ్మం, నవంబర్ 27 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు చేతివాటంతో రైతులు నష్టపోతున్నారు. అన్నదాత వద్ద తక్కువ ధరకు కొని అదే ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇదంతా సంబంధిత మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. వరి కోతలు ముమ్మరం కావడంతో ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అధిక మొత్తంలో వస్తున్నది.
ఇదే అదునుగా భావించిన దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొని దానిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడి సిబ్బందితో కుమ్మక్కై ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.
వేంసూరు మండలంలో..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కందుకూరు, దిద్దుపూడి, బరినపాడు, దిద్దుపాడులోని కొనుగోలు కేంద్రాల్లో ఈ తరహా మోసాలకు తెరలేపారు. దుద్దిపాడులోని కొనుగోలు కేంద్రంలో రైతు తన అవసరాల రీత్యా వ్యాపారి చెప్పినట్టు క్వింటాకు రూ. 1,600 చొప్పున మూడెకరాల పంటను అమ్మాడు. అయితే ఆ దళారి అదే ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముతూ అధికారులకు దొరికాడు.
పైగా ప్రభుత్వానికి సంబంధించిన గన్నీ బ్యాగుల్లో ధాన్యాన్ని నింపి కాంటాలు వేసి, అమ్ముకునే ప్రయ త్నం చేశాడు. మార్కెట్ సిబ్బంది, లారీ డ్రైవర్‌తో కలిసి ధాన్యాన్ని వేరే ప్రాంతానికి తర లించేందు ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ అడ్డుకోవడంతో అసలు విషయం బయటప డింది.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర అందిస్తున్నా.. కొందరు రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు కొనుగోలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటను దొడ్డి దారిన కొనటంతోపాటు రూ.500 బోనస్‌ను కూడా కొట్టేయాలని చూస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో నిఘా పెంచి ఇటువంటి వారికి సహకరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
30వేల టన్నుల కొనుగోళ్లు
జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రా ల్లో ఇప్పటి వరకు 30వేల మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. జిల్లాలో 2,88,888.78 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 6,64,444.2 మెట్రి క్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లావ్యా ప్తంగా 324 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు మిల్లులకు తరలిస్తున్నారు.