రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో నిర్వహించే పలు శిక్షణా కార్యక్రమాల్లో తెలిసిన వ్యక్తుల పేర్లతో తప్పుడు బయోడేటాలను సమర్పించి ఫేక్ ఇన్వాయిస్‌లను తయారు చేసి అవినీతికి పాల్పడిన మాజీ డైరెక్టర్ బి లక్ష్మీ అలియాస్ భాగ్యలక్ష్మీని పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ అలియాస్ భాగ్యలక్ష్మీ ఆస్కీలో సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ విభాగానికి మాజీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
పలు శిక్షణా కార్యక్రమాలకు తెలిసిన వ్యక్తుల పేర్లతో తప్పుడు రెజ్యూమ్‌ల నమోదు చేసి వాళ్ల పేర్లతో ఫేక్ ఇన్వాయిస్‌లను సృష్టించి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసినట్టుగా ఆస్కీ ఏఓ బి. జగదీష్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన సీసీఎస్ పోలీసులు 2021 నుంచి 2024 వరకూ ఈ తరహా మోసాలను తన పీఏ రవికుమార్ సహాయంతో ఆస్కీ సొమ్మును పెద్ద మొత్తంలో డ్రా చేసినట్టు విచారణలో తేలింది.
ఈ మొత్తం దాదాపు రూ. 40 లక్షలు దాకా ఉంటుందని అంచనా. ఈ కేసులో మాజీ డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మీ అలియాస్ భాగ్యలక్ష్మీ (63) పై ఆర్థిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.