హైదరాబాద్,(విజయక్రాంతి): ఇప్పటి వరకు ఉద్యోగాల పేరుతో మోసపోయిన వాళ్లను చూశాం కానీ, తాజాగా గాడిద పాల పేరుతో మోసపోయిన వారిని ఇప్పుడే చూస్తున్నాం. గాడిద పాల ఉత్పత్తి పేరిట తెలంగాణతో సహా 4 రాష్ట్రాల రైతులను చెన్నై సంస్థ నిండా ముంచేసింది. డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ పేరుతో దాదాపు రూ.100 కోట్లు దండుకున్నారని బాధితులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. డాంకీ ప్యాలెస్ సంస్థ రైతులకు గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాదికారులు కావచ్చని ప్రచారం చేసింది. దాని గుడ్డిగా నమ్మిన రైతులు సంస్థ నుంచి ఒక్కో గాడిదను రూ.లక్షన్నర వరకు విక్రయించినట్లు తెలిపారు. లీటర్ గాడిద పాలను రూ.1600లకు కొంటామని, 3 నెలలపాటు పాలను కొని నమ్మకం కల్గించిన సంస్థ ఇప్పటి వరకు 18 నెలలుగా గాడిద పాల డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని బాధితులు లబోదిబోమంటున్నారు. డాంకీ ప్యాలెస్ సంస్థ చెక్కులు బౌన్స్ అయ్యాయని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరారు.