calender_icon.png 30 October, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొని మోసం

14-09-2024 12:00:00 AM

  1. విదేశాల్లో ఉద్యోగం అంటూ యువతకు వల
  2. అక్కడికి చేరుకున్నాక సైబర్ నేరాలు చేసేలా ట్రైనింగ్ 
  3. ఇండియా నుంచి కంబోడియాకు యువకులను తరలిస్తున్న మహిళ అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈసారి కంబోడియా కేంద్రంగా సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేశారు తెలంగాణ పోలీసులు. ముంబాయికి చెందిన ప్రియాంక శివకుమార్‌సిద్దూ(30) అనే మహిళా ఏజెంట్‌ను శుక్రవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. నిరుద్యోగ యువతే టార్గెట్‌గా మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనం అంటూ సదరు ఏజెంట్ ప్రకటనలు రిలీజ్ చేసేది.

అలా ఒక్కో బాధితుడి నుంచి రూ. 30 వేలు వసూలు చేసేది. అనంతరం బాధితులను కంబోడియాకు పంపేందుకు వీసాలు కూడా సిద్ధం చేసింది. అయితే, చైనాకు చెందిన ఓ సైబర్ క్రైమ్ కంపెనీకి ఆమెను ఏజెంట్‌గా రిక్రూట్ చేసినట్లుతెలుస్తోంది. ఇలా ఒక్కో నియామకానికి సైబర్ నేరగాళ్లు ప్రియాంకకు 500 డాలర్లు చెల్లిస్తున్నారని విచారణలో అంగీకరించింది. అలా ఇండియా నుంచి వెళ్తున్న వారిని సైబర్ క్రిమినల్స్‌గా మార్చి కేటుగాళ్లు అమాయకుల నుంచి కోట్లు కాజేస్తున్నారు. వారిని బలవంతంగా ఈ వృత్తిలో దింపుతున్నట్లు తెలిసింది.

సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని

ప్రియాంక గతంలో మాక్స్‌వెల్ అనే లైసెన్స్ కలిగిన విదేశీ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో పనిచేసేది. ఆ కంపెనీ ఎండీ అనారోగ్య సమస్యల కారణంగా దానిని మూసివేశారు. కంపెనీలో చేసిన అనుభవంతో ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండానే ప్రియాంక జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇదే రకమైన ఏజెన్సీని నిర్వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. నారాయణ కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని, వాటి కోసం చైనాకు చెందిన ఝాన్ ఝీ కంపెనీ యజమాని జితేందర్ షా అలియాస్ అమీర్ ఖాన్‌ను ప్రియాంకకు పరిచయం చేశాడు. వారి సూచన మేరకు ప్రియాంక కంబోడియావెళ్లి వారితో ఒప్పందం కుదుర్చుకుంది.

మొదటగా తన సోదరి కుమారుడు అక్షయ్, అతని స్నేహితుడు డానిష్‌ఖాన్‌ను కంబోడియాకి పంపింది. అలా వెళ్లిన వారిపై ఒత్తిడి తెచ్చి జితేందర్‌షా సైబర్ నేరాలు చేయాలని ఒప్పించాడు. ఈ క్రమంలో ప్రియాంక చేసిన ప్రకటనలు చూసిన హైదరాబాద్‌కుచెందిన వంశీకృష్ణ, సాయిప్రసాద్ ఆమెను సంప్రదించారు. ఆమె ప్రతి అభ్యర్థికి రూ.30 వేలు కమీషన్ తీసుకొని విజిటింగ్ వీసాపై కంబోడియా పంపింది. అక్కడికి వెళ్లిన బాధితులకు సైబర్ నేరాలకు పాల్పడడం ఇష్టం లేక వారి నుంచి తప్పించుకొని ఇండియాకి వచ్చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రియాంకను తెలంగాణ ఎస్‌ఎస్‌బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.