13-03-2025 12:30:38 AM
కాటేదాన్ లో భారీ గా కల్తీ నిత్యావసర వస్తువులు పట్టివేత
8 లక్షలు విలువచేసే 20 రకాల కిరాణా వస్తువులు సీజ్
దాడులు నిర్వహించిన రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ బృందం
రాజేంద్రనగర్, మార్చి 12 (విజయ క్రాంతి): బ్రాండెడ్ వస్తువుల పేరుతో కల్తీ నిత్యావసర సరుకులు తయారు చేస్తుండగా రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి 20 రకాల కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ మధుబన్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్ళు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్ వస్తువుల మాదిరిగా ప్యాకింగ్ చేస్తూ ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి వివిధ రకాల కిరాణా వస్తువులు తయారీ చేస్తున్నారు.
బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్, బ్రూక్ బాండ్ తాజ్మహల్ టీ పౌడర్. వీల్ సర్ఫ్, ప్యార షూట్ కొబ్బరి నూనె, కంఫర్ట్ కండీషనర్, క్లినిక్ ప్లస్ హెయిర్ షాంపో, కార్న్ పౌడర్, పాండ్స్ బాడీ లోషన్ తో పాటు వివిధ వస్తువులు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమార్కులు కల్తీ వస్తువులు ఒరిజినల్ అన్నట్లుగా ప్యాకింగ్ చేసి మార్కెట్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈమేరకు ఘనోభా, ఖుషి, రీత, మనీష అనే నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 8 లక్షలు విలువచేసే కల్తీ నిత్యవసర వస్తువులను సీజ్ చేశారు. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.