calender_icon.png 25 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు అధిక లాభాలంటూ మోసం

25-10-2024 12:14:20 AM

  1. 120 మంది నుంచి 24 కోట్లు వసూలు చేసి పరార్
  2. స్కేర్ యార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాడ్ అవెన్యూస్ కంపెనీల డైరెక్టర్ల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తామని 120 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి పరారైన కేటుగాళ్లను గురువారం ఈవోడబ్ల్యూ (ఎకనామిక్ అఫెన్స్ వింగ్) పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కే ప్రసాద్ కథనం ప్రకారం..

స్కేర్ యార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాడ్ అవెన్యూస్ కంపెనీలు కలిసి తమ సంస్థలో రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 100 నెలల పాటు ఇస్తామని, అలాగే మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో రెండు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించారు.

రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లో చందనం చెట్ల పెంపకం చేపడతామని, 13-15 ఏళ్ల అనంతరం వాటిని విక్రయిస్తే వచ్చే డబ్బులో 50 శాతం లాభాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలా మొత్తం 120 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు చేశారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలగడానికి ఎంవోయూ, లీజ్ డీడ్, పోస్ట్‌డేటేడ్ చెక్కులను సెక్యూరిటీగా అందించారు. కొద్ది నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లించారు.

అనంతరం కంపెనీని మూసేసి తప్పించుకు తిరుగుతున్నారు. కేపీహెచ్‌బీకి చెందిన బాధితుడు అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు స్కేర్ యార్డ్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు బైర చంద్రశేఖర్, వేములపల్లి జాన్వి, గరిమెల్ల వెంకట అఖిల్, యాడ్ అవెన్యూస్ డైరెక్టర్ రెడ్డిపల్లి కృష్ణచైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.