తెలంగాణలో హైదరాబాద్‌తో పాటుగా 33 జిల్లాల ముఖ్య పట్టణాల్లో కిరాణా, పూలు, పండ్లు ఇలా ప్రతి వస్తువుల తూకాల్లో అన్యాయం జరుగుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో తూకాల తనిఖీ శాఖనుంచి అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి మోసం చేసిన వారిపై కేసులు పెట్టడం, దుకాణాలు మూసివేయించడం లాంటివి చేసే వారు. అయితే గత కొంతకాలంగా తనిఖీలు లేకపోవడంతో దుకాణాదారులు అడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది.
ముఖ్యంగా, పూలు, పండ్ల తూకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, సగానికి సగం దోపిడీ జరుగుతోందని మహిళలు గోలపెడుతున్నారు. కార్తీక మాసంతో పాటుగా, అయ్యప్పదీక్షల సీజన్ కావడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని సాకుగా చేసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు ఒకవేళ తనిఖీలు నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే సాగుతున్నాయని, ముడుపులు అందుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తూనికలు, కొలతల శాఖ ఉన్నతాధికారులు తక్షణం ఈ దోపిడీపై దృష్టిపెట్టాలని కోరుకుంటున్నారు.
- డా.విజయ భాస్కర్