calender_icon.png 25 November, 2024 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం

05-11-2024 02:42:07 AM

50 లక్షలు కాజేసిన నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): ట్రేడింగ్‌లో పెట్టుబడుల పే రుతో ఓ రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసి అతడి ఖాతాలోని రూ. 50 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ట్రేడింగ్ పేరుతో వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది.

బాధితుడికి ట్రేడింగ్‌పై ఆసక్తి ఉండటంతో స్కామర్ల సూచనల మేరకు ‘స్టాక్ డిస్కషన్’ అనే గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. ప్రముఖ ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేసుకున్న కునాల్ సింగ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో గ్రూప్ సభ్యులకు ట్రేడింగ్‌పై మెళకువలు నేర్పించాడు. సింగ్ సూచనల మేరకు పెట్టుబడులు పెడితే గణనీయమైన లాభాలు వచ్చినట్లు గ్రూప్‌లోని మిగతా సభ్యులు పేర్కొన్నారు.

ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు.. కునాల్ సింగ్ సూచనల మేరకు ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చినట్లు చూపిస్తూ, బాధితుడితో మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టించారు.

ఇలా పలు దఫాలుగా మొత్తం రూ. 50 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అనంతరం ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

బాధితుడి ఖాతాలో 1.05 కోట్లు రీఫండ్

ఇటీవల సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 1.22 కోట్లు కోల్పోయిన బాధితుడికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బును తిరిగి ఇప్పించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు.

ఇదంతా నిజమేనని నమ్మి పలు దఫాలుగా మొత్తం రూ. 1.22 కోట్లు పెట్టుబడులుగా పెట్టాడు. మొదట్లో భారీ లాభాలు వచ్చాయంటూ చూపించి, వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి మరింత చెల్లించాలని తెలిపారు. దీంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో డీసీపీ ధారా కవిత నేతృత్వంలో ఏసీపీలు శివమారుతి, చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కే మధుసూదన్‌రావు బృందం రంగంలోకి దిగి బ్యాంకు అధికారులకు వివరాలను తెలిపి సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ. 1.05 కోట్ల మొత్తాన్ని ఫ్రీజ్ చేయించగలిగారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల ప్రకారం బాధితుడికి రూ. 1.05 కోట్లను అందించినట్లు సీపీ తెలిపారు.