రూ.5.27 కోట్ల మేర టోకరా
సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
పశ్చిమ బెంగాల్‌లో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : అతడో పెట్రోల్ బంక్ యజమాని. వ్యాపారంలో నష్టాలు రావడంతో పరిచయస్తుల సలహా మేరకు కమిషన్‌కు కక్కుర్తి పడి ఓ బ్యాంకు ఖాతా తెరిచాడు. ఖాతా లావాదేవీలను సైబర్ నేరగాళ్లకు అప్పగించాడు. ఓ బాధితుడి ఫిర్యా దు కేసు నమోదు చేసిన జీజీసీఎస్బీ అధికారులు పశ్చిమబెంగాల్‌కు చెందిన సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి జూలై 11న ఫేస్‌బుక్‌లో షేర్ మార్కెట్ సంబంధించి ఓ ప్రకటనను చూశాడు. ఆకర్షితుడైన బాధితుడు ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. ఆ వెంటనే వాట్సప్ గ్రూప్‌లో బాధితుడు తన ప్రమే యం లేకుండానే యాడ్ అయ్యాడు. ఆ గ్రూపులో అంకుర్ కేడియా అనే వ్యక్తి ప్రధాన పెట్టుబడిదారుడిగా తనను గ్రూప్ సభ్యులను పరిచయం చేసుకున్నాడు. బాధితుడు ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ అధికారి, గ్రూప్ అడ్మిన్ తో సంభాషించాడు. వాట్సప్ గ్రూపులో కేడియా స్టాక్ సిఫార్సులను షేర్ చేస్తుండేవాడు. అలా కొద్ది రోజుల తర్వాత జూన్, జూలైలో అనేక ప్రముఖ కంపెనీల ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవాలని గ్రూప్ సభ్యులకు సూచన వచ్చింది.
దీంతో కొందరు గ్రూప్ నిర్వాహకులు సూచించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో బాధితుడు కూడా ఉన్నాడు. ఇలా అతడు రూ. 5.27 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో ఒకసారి తాను పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా కేవలం రూ.45 వేలు మాత్రమే విత్‌డ్రా అయ్యాయి. అనంతరం తన ఖాతా ఫ్రీజ్ అయినట్లు గుర్తించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌ల్నో కొంటైకి చెందిన సైబర్ నేరగాడు సైదు ల్ ఇస్లాం ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నేరాల బాట పట్టాడిలా..
సైదుల్ ఇస్లాం ఖాన్ పెట్రోల్ బంక్ గతంలో పెట్రోల్ బంక్ నడిపి నష్టపోయాడు. తర్వాత ఎస్‌ఆర్‌ఆర్ బ్రిక్ ఫీల్డ్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో కరెంట్ ఖాతా తెరిచాడు. ఖాతా వివరాలను కమిషన్ కోసం సైబర్ నేరగాళ్లకు అందించాడు. హైదరాబాద్‌న డబ్బులో రూ.కోటి సైదుల్ ఇస్లాంఖాన్ ఖాతాల్లో జమకావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని నెట్ బ్యాంకింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ప్రస్తుతం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.