calender_icon.png 6 November, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ మోసం

06-11-2024 02:05:36 AM

రూ.9 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ యువతిని నమ్మించి రూ.9 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నా యి.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగినికి పార్ట్ టైం జాబ్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్ర్కైబ్ చేసి, స్క్రీన్ షాట్లు ఫార్వర్డ్ చేయాలని, అందుకు తగిన వేతనం ఇస్తామని నమ్మించారు సైబర్ నేరగాళ్లు. అనంతరం టెలిగ్రామ్ ఛానల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పారు.

బాధితురాలికి కొన్ని యూట్యూబ్  లింక్‌లను పంపించారు. అలాగే ట్రేడింగ్ సంబంధించిన ఓ లింక్‌ను పంపించారు. ట్రేడింగ్‌పై ఆసక్తి ఉండడంతో ఆ యువతి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టింది. వచ్చిన లాభాలను విత్ డ్రా చేయాలనుకుంటే ఛార్జీల రూపంలో మరికొంత చెల్లించాలని నమ్మించారు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ. 9 లక్షలు చెల్లించింది. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మనీలాండరింగ్ కేసు అంటూ.. 

నగరానికి చెందిన ఓ రిటైర్డ్ మహిళా ఉద్యోగికి పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, బ్యాం కు ఖాతాలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. కేసుతో సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కోరారు. విచారణ నిమిత్తం బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. లేకపోతే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, అరెస్ట్ కూడా చేయాల్సి ఉంటుందని బెదిరించారు.

ఆర్బీఐ నిబంధనల మేరకు ఆమె ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని వాగ్ధానం చేశారు. దీంతో స్కామర్లు సూచించిన ఖాతాకు మొత్తం రూ. 31 లక్షలు బదిలీ చేసింది. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.