calender_icon.png 26 October, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మోసం

12-09-2024 12:00:00 AM

1.18 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతుంది. వయో వృద్ధుల నుంచి విద్యార్థుల వరకు ఎవరినీ వదలడం లేదు. వయస్సును బట్టి వారి అవస రాలను ఆసరాగా చేసుకొని, అధిక డబ్బు సంపాదించవచ్చంటూ మాయమాటలు చెప్తూ నిండా ముంచుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఒక విద్యార్థిని పార్ట్ టైమ్ జాబ్ పేరుతో మోసం చేసి రూ. 1.18 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ఓ విద్యార్థికి 7099320745 మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో పలు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ప్రతి నెల రూ. 60 వేల వరకు సంపాదించవచ్చని, ఆసక్తి ఉంటే లింక్‌లో జాయిన్ కావాలని సూచించారు.

దీంతో బాధిత విద్యార్థి సైబర్ నేరస్తుడు పంపిన లింక్‌ను ఓపెన్ చేసి తన వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలను పొందుపరిచాడు. అనంతరం పెట్టిన పెట్టుబడికి ఆరు రెట్లు అధికంగా లాభాలు ఇస్తామని చెప్పి, కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని సూచించారు. నిజమని నమ్మిన బాధితుడు వారు చెప్పిన ఖాతాకు రూ. 1.18 లక్షలను బదిలీ చేశాడు. అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.