మంచిర్యాల, జనవరి 26 (విజయక్రాంతి): క్షుద్ర పూజల ద్వారా డబ్బుల వర్షం కురిపిస్తానని మంచిర్యాలకు చెందిన ఓ యువకుడి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసిన గ్యాంగ్‌ను నస్పూర్ పోలీసులు పట్టుకున్నారు. సీసీసీ నస్పూర్ ఎస్సై కరుణాకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఓ పూజారి తమకు తెలుసని, క్షుద్ర పూజలు చేసి డబ్బుల వర్షం కురిపిస్తాడని మంచిర్యాల పట్టణానికి చెందిన మాదంశెట్టి ప్రభంజన్‌ను రంజిత్, బాలకృష్ణ నమ్మించారు.
ఇందుకోసం రూ.రెండు లక్షలు ఖర్చవుతాయని నమ్మబలికారు. దీంతో ప్రభంజన్ ఈ నెల 24న రాత్రి 11 గంటల ప్రాంతంలో నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐత సత్యనారాయణ అలియాస్ సతీష్ ఇంటికి రూ.రెండు లక్షలు తీసుకెళ్లాడు. అక్కడ పూజారి శీతల్ దత్తాత్రేయ కొరవి ఝాదవ్ అలియాస్ శివ చరణ్ ఝాదవ్‌తోపాటు నస్పూర్ సీతారాంపల్లికి చెందిన దెబ్బటి కిషన్, దంతెల ప్రభాకర్, జగిత్యాలకు చెందిన ఎరిసి ప్రశాంతి ఉన్నారు.
రాత్రి రెండు గంటల సమయంలో అఘోరి, ప్రశాంతిలు కలిసి క్షుద్ర పూజలు చేస్తుండగా ప్రభంజన్‌కు అనుమానం వచ్చి మధ్యలోనే డబ్బుతో సహా వెళ్లిపోయే ప్రయత్నం చేశా డు. అక్కడున్న వారంతా ప్రభంజన్‌ను అడ్డగించి డబ్బులు ఇచ్చిపోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించడంతో డబ్బులిచ్చి పారిపోయాడు. ఆ తర్వాత ప్రభంజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీసీ నస్పూర్ సుగుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఆ గ్యాంగ్‌లో నలుగురిని ఆదివారం రిమాండ్‌కు తరలించగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.