- అంధేరీ పోలీసులమంటూ వాట్సాప్ కాల్
- రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి రూ.37.90 లక్షలు లూటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. సీనియర్ సిటిజన్స్ టార్గెట్‌గా పోలీసులు, సీబీఐ అధికారుల వేషధా రణలో మాయమాటలు చెప్పడంతో పాటు డిజిటల్ అరెస్టులు చేస్తామంటూ చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.
తాజాగా నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగినిని భయబ్రాంతులకు గురిచేసి ఆమె ఖాతాలో ఉన్న రూ.37.90 లక్షలను కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి(74)కి అంధేరి(ముంబై) పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. మీపై అంధేరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు.
అలాగే మీ మొబైల్ నంబర్ నుంచి అసభ్యకరంగా మెసేజ్‌లు, పలు మోసపూరిత ప్రకటనలకు సం బంధించిన మేసేజ్‌లు పంపుతున్నారనీ, 24 గంటల్లో ట్రాయ్ నిబంధనల మేరకు మీ పేరు మీద ఉన్న అన్ని మొబైల్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడతాయని పేర్కొన్నారు.
నరేష్ గోయల్ అనే వ్యక్తికి చెందిన అంతర్జాతీయ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మీ బ్యాంకు ఖాతాలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంటూ స్కామర్లు సీబీఐ, ఆర్బీఐల నుంచి వచ్చినట్లు నకిలీ లేఖలు పంపారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలపై జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసుతో మీకు ఎలాంటి సంబంధం లేకుంటే, విచారణకు సహకరించాలని కోరారు. కేసు విచారణ నిమిత్తం బాధితురాలికి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. లేకపోతే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, అరెస్ట్ కూడా చేయవలసి ఉంటుందని భయబ్రాంతులకు గురిచేశారు.
ఆర్బీఐ నిబంధనల మేరకు ఆమె ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఈ కేసు విచారణ రహస్యంగా జరుగుతుందని, పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పొద్దంటూ ఆదేశించారు.
దీంతో భయపడిపోయిన బాధితు రాలు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేసుకొని, ఆర్టీజీఎస్ ద్వారా స్కామర్లు సూచించిన ఖాతాకు మొత్తం రూ. 37.90 లక్షలు బదిలీ చేసింది. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.