- ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేదలను నట్టేట ముంచారు
- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, అక్టోబర్ 28: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పేదలను మోసం చేశారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సోమవారం వనస్థలిపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని జీవో 118 బాధిత కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మధుయాష్కీ గౌడ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా 118 జీవో ద్వారా తాము ఎలా మోసపోయామనే విషయాన్ని వివవరించారు. బీఎన్ రెడ్డి డివిజన్‌లోని సీలింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలను కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయకుండా 2008లో అప్పటి ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచింది. ఫలితంగా స్థలాలు కొన్నవారికి బ్యాంకు రుణాలు రాలేదు.
కాగా, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినతితో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో ఇంటి స్థలాల సమస్య పరిష్కారం కోసం 118 జీవో తెచ్చింది. జీవోను సక్రమంగా అమలు చేయకపోవడంతో సమ స్యలు అలాగే ఉన్నాయని బాధితులు వివరించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 118 తెచ్చిందన్నారు.
పేదలకు శాశ్వత పరిష్కారం చూపకుండా సమస్యను వదిలేసిందన్నారు. కన్వీనియన్స్ డీడ్‌కు అసలు విలువే లేదని, రుణాలు రావని.. ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లకు విలువ లేకుండా చేశార న్నారు. సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.