25-07-2024 12:05:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టు బడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి రూ.19.50 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. సైబర్ క్రైం డీసీపీ డి. కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యాపారికి ఇటీవల ‘మార్వారీ సెక్యూరిటీస్ ఫైనాన్షి యల్ లిమిటెడ్ (ఎమ్‌ఎస్‌ఎఫ్‌ఎల్)లో పనిచేస్తున్న ప్రతినిధి పేరుతో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను ట్రేడింగ్ ప్రొవైడర్‌గా పరిచయం చేసుకున్నాడు.
మాటల గారడీతో వ్యాపారిని బుట్టలో వేసుకున్నాడు. ట్రేడింగ్ ప్రొవైడర్ అనంతరం వ్యాపారిని 140 మంది సభ్యులు ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. ట్రేడింగ్ కోసం https://flrwev. top/h55/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని ట్రేడింగ్ ప్రొవైడర్ సూచించేవాడు. అలా కొందరి ఖాతాల్లో భారీగా సొమ్ము జమ అయిందని స్క్రీన్ షాట్స్ పెట్టేవాడు. ఆ స్క్రీన్ షాట్స్ చూసి వ్యాపారి రూ.19.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ట్రేడింగ్ ప్రొవైడర్‌తో పాటు వాట్సాప్ గ్రూప్‌లో ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో తాను మోసపోయాడని వ్యాపారి గుర్తించాడు. బుధవారం సెంట్రల్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి సైబర్ క్రైంపై ఫిర్యాదు చేశాడు.
క్రెడిట్ కార్డు ఇస్తామంటూ..
అధిక లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇస్తామంటూ బాధితుడి ఖాతా నుంచి సొమ్ము కాజేసిన ఘటన బుధవారం వెలుగు చూసిం ది. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి కొంతకాలం క్రితం ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి అధిక లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగిని బుట్టలో వేసుకున్నాడు. అనంతరం కాలర్ అడిగిన విధంగా ఓటీపీతో పాటు కేవైసీ తదితర వివరాలను చెప్పాడు. రెండు గంటల తర్వాత బాధితుడి మొబైల్‌కు అతడి కార్డు నుంచి రూ.1.22 లక్షలు డెబిట్ అయినట్లు మేసేజ్ వచ్చింది. తన ఖాతా నుంచి డబ్బు బదిలీ అయిందని గుర్తించిన బాధితుడు సెంట్రల్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.