రూ.16.40 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): నగరానికి చెందిన ఓ వ్యాపారి(55) సైబర్ నేరగాళ్ల బారినపడ్డాడు. సదరు వ్యాపారికి వాట్సాప్ కాల్ చేసి అప్‌స్టాక్స్ ముఖ్య వ్యూహకర్తగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. అంతర్జాతీయ అప్‌స్టాక్స్ యాప్ ద్వారా అప్పర్ సర్క్యూట్(యూసీ) స్టాక్‌లు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) స్టాక్‌లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. ఇందుకోసం సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని సూచించాడు.
ఐపీఓల కోసం సబ్‌స్ర్కైబ్ చేయడానికి, స్టాక్‌లను కొనుగోలు చేయడానికి వారు సూచించిన ఖాతాలో నిధులు జమ చేయమని చెప్పారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 16.40 లక్షలు పెట్టుబడులుగా పెట్టాడు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగం పేరిట..
కామారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఉద్యోగం పేరిట ఓ యువకుడు సైబర్ వలలో చిక్కి రూ.1,32,000 పోగొట్టుకున్న ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని తాడ్కోల్ గ్రామంలో చోటు చేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని సైబర్ నేరగాళ్లు యువకుడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. రూ.1.32లక్షలు పంపిస్తే ఉద్యోగం ఇస్తామని తెలుపడంతో యువకుడు పంపించాడు.ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసాపోయనని తెలుసుకున్న యువకుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
పెట్టుబడి పేరుతో..
ఘట్‌కేసర్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించొచ్చని సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. ఘట్‌కేసర్‌కు చెందిన అక్తర్ ఉల్ హక్ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేసి చూడగానే వెంటనే కాల్ వచ్చింది. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో అది నమ్మి మొదటగా రూ.20 వేలు పంపించాడు. ఆ తర్వాత పలు దఫాలుగా మొత్తం రూ.1,35,000 పంపించాడు. తర్వాత తిరిగి ఎలాంటి రిటర్న్స్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.