- 7 కోట్లు కొల్లగొట్టిన కన్సల్టెన్సీ సంస్థ
- బాధితుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
కూకట్‌పల్లి, నవంబర్ 1: అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలకు ఆశ చూపి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవోడబ్ల్యూ(ఎకనామిక్ అఫెన్స్ వింగ్) పోలీసుల కథనం ప్రకారం..
ఏపీలోని కాకినాడకు చెందిన విజ్జి జగదీశ్‌చంద్రప్రసాద్ కొంతకాలంగా కూకట్‌పల్లి హైదర్ నగర్‌లోని డీబీ స్టాక్ బ్రోకింగ్ కన్సల్టెన్సీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కన్సల్టెన్సీ యజమాని దీపాంకర్ బర్మాన్‌తో చేతులు కలిపాడు.
ఈ క్రమంలోనే తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు చెల్లిస్తామని అమాయక ప్రజలను నమ్మబలికించారు. అంతేకాకుండా వారికి వార్షిక పథకం కింద 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం, మూడు నెలలకు 24 శాతం, నెలకు ఏడు శాతం వడ్డీలు చెల్లిస్తామని చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. జూలై నెల వరకు భారీ మొత్తంలో నగదు వసూలు చేసి ఆ తర్వాత తమ వ్యాపారాన్ని మూసివేశారు. ఆ తర్వాత బాధితులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విజ్జి జగదీశ్‌చంద్రప్రసాద్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీపాంకర్ బర్మాను అసోం పోలీసులు గౌహతిలో అరెస్ట్ చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తెలిపారు.