- అక్కడికి చేరుకున్నాక సైబర్ నేరాలు చేయాలంటూ యువకుడిపై ఒత్తిడి
- ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్ట్ చేసిన టీజీసీఎస్‌బీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల వేసి, తీరా అక్కడికి చేరుకున్నాక వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని ఒక సభ్యుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) అరెస్ట్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఓ ముఠా సిరిసిల్లకు చెందిన ఓ యువకుడిని కంబోడియా దేశానికి పంపింది.
అక్కడికి చేరుకోగానే చైనాకు చెందిన సైబర్ క్రైమ్ ముఠాకు ఆ యువకుడిని అప్పజెప్పారు. ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, వీసా ఫీజు అంటూ కంబోడియాకు పంపే ముందు ఆ యువకుడి నుంచి రూ. 1.50 లక్షలు వసూలు చేశారు. అయితే, కంబోడియా చేరుకోగానే యువకుడి వద్ద పాస్‌పోర్ట్ లాక్కొని సైబర్ నేరాలు చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు.
దీంతో బాధితుడు తన తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు. వారి ఫిర్యాదుతో గత మే నెలలో కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. ఈ నెల 2న యూపీకి చెందిన సదకత్ ఖాన్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే జగిత్యాలకు చెందిన కే సాయిప్రసాద్, పుణెకి చెందిన మహమ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ, బీహార్‌కు చెందిన మహ్మద్ సాదాబ్ అలాంను అరెస్ట్ చేసినట్లు టీజీసీఎస్‌బీ అధికారులు వెల్లడించారు.