calender_icon.png 20 September, 2024 | 8:31 AM

పార్సిల్‌లో మాదకద్రవ్యాల పేరుతో మోసం

20-09-2024 12:00:00 AM

వృద్ధుడి నుంచి 1.16 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ముంబాయి నుంచి తైవాన్‌కు పంపిస్తున్న పార్సిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయంటూ ఓ వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి రూ.1.16 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ వృద్ధుడికి డీటీడీసీ కొరియర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. మీరు ముం బాయి నుంచి తైవాన్‌కు పంపిస్తున్న పార్సిల్‌లో 700 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 8 ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన పలు కార్డులు ఉన్నాయంటూ భయభ్రాంతులకు గురిచేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు మీపై కేసు నమోదైందని, అరెస్ట్ కూడా చేసే అవకాశముందని పేర్కొన్నాడు.

విచారణ నిమిత్తం బాధితుడిని సైబర్ క్రైమ్ అధికారితో మాట్లాడాలని సూచించగా, వీడియో కాల్‌లోకి వచ్చిన నేరగాడు తనని తాను అధికారిగా పరిచయం చేసుకొని బాధితుడిని పలు రకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పార్సిల్‌తో సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని, ఆర్బీఐ నిబంధనల మేరకు ప్రస్తుతం ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక 24 గంటల్లో తిరిగి పంపిస్తామని నమ్మించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు వారు సూచించిన ఖాతాకు రూ. 1.16 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.