calender_icon.png 24 October, 2024 | 6:56 AM

కొరియర్ సర్వీస్ పేరుతో మోసం

29-08-2024 04:17:52 AM

కరీంనగర్‌లో వెలుగు చూసిన ఘటన

కరీంనగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ముంబై కేంద్రంగా కొరియర్ సర్వీస్ పేరుతో కరీంనగర్ జిల్లాలో మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఆ కంపెనీ ఉచ్చులో పడి ఎంతో మంది యువకులు రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. నేరగాళ్లు ఒక్కో యువకుడి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఒక్క కరీంనగర్ జిల్లాకేంద్రంలోనే కంపెనీ మోసానికి పది మంది వరకు మోసపోయారని సమాచారం. తాజాగా ఓ బాధితుడు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. ముకరంపురకు చెందిన మహ్మద్ రహీమొద్దీన్ ఫిబ్రవరి 13న ఈజీ కనెక్ట్ పేరుతో ఉన్న ఓ కొరియర్ సర్వీస్‌లో చేరాడు.

కంపెనీ ప్రతినిధులు యువకుడి నుంచి రూ.1.30 లక్షలు ఒకసారి, మరోసారి రూ.20 వేలు వసూలు చేశారు. మొదటిసారి తీసుకున్నప్పుడు ప్రతినిధులు స్టాంప్ పేపరుపై అగ్రిమెంట్ చేసి యువకుడికి ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం యువకుడు కంపెనీ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ అయ్యాడని భావించాడు. ఆ తర్వాత నెల గడిచినప్పటికీ కంపెనీ యువకుడికి ఎలాంటి కన్‌సైన్‌మెంట్ పంపలేదు. దీంతో బాధితుడు హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్‌ను సంప్రదించగా, కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్, ఎం.కుమార్ ముంబై ఆఫీస్‌లో ఉంటారని వారిని పరిచయం చేశాడు.

ఈ విషయమై మార్చిలో వారిని సంప్రదించగా, ముందు చెప్పిన ప్రకారం కమిషన్ ఇవ్వకుండా, తక్కువ కోట్ చేసి కొంత సొమ్ము ఇచ్చారు. తర్వాతి నెల నుంచి మళ్లీ కమిషన్ రావడం ఆలస్యమైంది. దీంతో విసిగిపోయిన బాధితుడు తన డిపాజిట్ చేసిన రూ.1.50 లక్షల సొమ్ము ఇవ్వాలని కంపెనీ వారికి కాల్ చేసి చెప్పాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని నిర్ధారించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అప్పు చేసి కంపెనీకి సొమ్ము డిపాజిట్ చేశానని వాపోయాడు. ఇలా మోసపోయిన వారిలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫోన్ చేయగా, వారు స్థానిక ఠాణాలోనే ఫిర్యాదు చేయాలని సూచించారు. తర్వాత బాధితుడికి ఏం చేయాలో అర్థంకాక న్యాయవాదిని సంప్రదించి సదరు కంపెనీకి లీగల్ నోటీస్ పంపించాడు. మళ్లీ విసిగిపోయిన బాధితుడు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు.