12-04-2025 01:00:51 AM
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఓయూ జాక్ నేత మోతీలాల్ నాయక్ ఆరోపించారు. ఆ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన తెలిపారు.
మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన గ్రూప్ పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోలేదని, పేపర్ లీకైందని నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీజీపీఎస్సీ ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలను బహిర్గతం చేస్తున్నా ఎందుకు నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లేదని విమర్శించారు. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్లు 21,093 మంది ఉంటే.. జీఆర్‌ఎల్ ప్రకారం 21,103 మంది ఎంపికయ్యారని, మరి ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రైవేటు కోచింగ్ సెంటర్లతో మూల్యాంకనం చేయించారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం 1:2 నిష్పత్తిలో ధ్రువ పత్రాల పరిశీలనకు పిలవాల్సి ఉండగా 1:1 నిష్పత్తిగా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ఈ ఫలితాలపై న్యాయ విచారణ జరపాలని కోరారు. ఈ అనుమానాలను నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెయ్యిమందితో ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.