calender_icon.png 16 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రాన్స్ అల్లకల్లోలం

27-07-2024 05:05:31 AM

  1. ఒలింపిక్స్ వేళ దేశవ్యాప్తంగా దాడులు
  2. స్తంభించిన హైస్పీడ్ రైల్వే వ్యవస్థ
  3. విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

ప్యారిస్, జూలై 26: కొద్ది గంటల్లో విశ్వక్రీడలు ఒలింపిక్స్ ప్రారంభమతాయనగా ఫ్రాన్స్‌ను సంఘ వ్యతిరేక శక్తులు అల్లకల్లోలం చేశాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా దాడులకు తెగబడ్డాయి. ఫ్రాన్స్ ప్రజా రవాణాకు జీవనాడి వంటి హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్తులను దుండగులు తగులబెట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోవటంతో దాదాపు 8 లక్షల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

రైల్వే నెట్‌వర్క్ టార్గెట్‌గా..

ఫ్రాన్స్‌లో హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌లను కొన్ని కంపెనీలు నిర్వహిస్తున్నాయి. అందులో టీజీవీ నెట్‌వర్క్ అతి ముఖ్యమైనది. దీనిని ఎస్‌ఎన్‌సీఎఫ్ కంపెనీ నిర్వహిస్తున్నది. శుక్రవారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభమయ్యాయి. అందుకు కొన్ని గంటల ముందు శుక్రవారం తెల్లవారుజామున దేశవ్యాప్తంగా టీజీవీ రైల్ నెట్‌వర్క్‌పై ఒక్కసారే దాడులు మొదలయ్యాయి. దుండగులు రైలు పట్టాలను ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల నిప్పు పెట్టారు. దాంతో చలా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. ముఖ్యంగా అట్లాంటిక్, నార్త్‌ర్న్, ఈస్టర్న్ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎస్‌ఎన్‌సీఎఫ్ ప్రకటించింది.  సోమవారం నాటికి రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని వెల్లడించింది. ఈ దాడుల వల్ల 8 లక్షల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎస్‌ఎన్‌సీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్ పీరీ తెలిపారు. దుండగులు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టినట్టు బెదిరించారు.  బాసెల్ ఫ్రాంకో ఎయిర్‌పోర్టుకు ఇలాంటి ఫోన్‌కాలే రావటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. 

ఉగ్రవాద దాడులేనా?

దేశవ్యాప్తంగా ప్రజారవాణాపై ఒకేసారి దాడి జరగడంపై ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడులను తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికీ వ్యవస్థీకృత నేరమేనని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ప్యాట్రైస్ వెర్‌గ్రీటీ తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకు ఉగ్రవాద ముప్పు ఉన్నదని గతంలోనే పలు నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ క్రీడల చరిత్రలో మొదటిసారి ప్రారంభ వేడుకలు ఒలింపిక్ స్టేడియంలో కాకుండా బహిరంగంగా సీన్ నది ఒడ్డున నిర్వహించారు. దాదాపు 7,500 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈ క్రీడలు వీక్షించేందుకు వచ్చినవారితో ఇప్పటికే ప్యారిస్ నగరం నిండిపోయింది. దాదాపు 3 లక్షల మంది విదేశీయులు ప్యారిస్‌కు చేరుకొన్నట్టు అంచనా. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా దాడులు జరుగటంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే, ఈ దాడుల వెనుక ఉగ్రవాద కోణం ఉన్నదా? లేదా? అనేదానిపై ఫ్రాన్స్ పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాడులపై దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు.