calender_icon.png 9 January, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిమళించిన మానవత్వం

06-01-2025 01:31:01 AM

* బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ పెద్దొళ్ల ప్రశాంత్‌రెడ్డి

* అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు

* ఉప్పల్‌లో ముగిసిన ప్రశాంత్‌రెడ్డి అంత్యక్రియలు

ఎల్బీనగర్, జనవరి 5: పుట్టెడు దుఖఃలో ఉన్నా... కన్నీళ్లను భరిస్తూ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరిస్తూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ అవయవాలను దానంచేసిన కుటుంబీకులు ఇతర కుటుంబాలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

వివరాల్లోకి వెళ్తే... రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పెద్దొళ్ల ప్రశాంత్‌రెడ్డి డిసెంబర్ 28న డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో వైద్యులు ప్రశాంత్‌రెడ్డిది బ్రెయిన్‌డెడ్‌గా పరిగణిస్తూ కుటుంబీకులకు చెప్పారు. జీవదాన్‌పై అక్కడి వైద్యులతోపాటు జీవదాన్ ప్రతినిధులు కుటుంబీకులకు అవగాహన కల్పించారు. దీనికి భార్య సౌమ్య, తండ్రి రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగిరెడ్డి.. మృతుడు ప్రశాంత్‌రెడ్డి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.

కుటుంబీకుల అంగీకారంతో ప్రశాంత్‌రెడ్డి అవయవాలను జీవన్‌దాన్ ప్రతినిధులు సేకరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రశాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా ప్రశాంత్‌రెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉప్పల్‌లో నిర్వహించారు.

కార్యక్రమానికి మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, కందకూరు ఇన్‌స్పెక్టర్ సీతారాం, రాచకొండ పోలీ సు అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి, రాచకొండ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సువర్ణతోపాటు, ప్రశాంత్‌రెడ్డి స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.