calender_icon.png 15 October, 2024 | 7:44 AM

10 బిలియన్ డాలర్లు దాటిన ఫాక్స్‌కాన్ వ్యాపారం

19-08-2024 12:00:00 AM

సంస్థ చైర్మన్ యంగ్ లియు 

శ్రీపెరంబుదూర్, ఆగస్టు 18: ఐఫోన్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ ఫాక్స్‌కాన్ వ్యాపారం భారత్‌లో ఇ ప్పటివరకూ 10 బిలియన్ డాలర్లు దాటినట్టు ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియు వెల్లడించారు. ఇండియా లో తాము ఇప్పటివరకూ 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేసినట్టు తెలిపారు. శ్రీపెరంబుదూర్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ సమీపంలో మహిళల కోసం నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా పద్మభూషణ్ ఆవార్డు గ్రహీత అయిన లియు మాట్లాడుతూ తన తాజా పర్యటన సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసానని, భారత్ వృద్ధి బాటలో ఉన్నదని గ్రహించానని చెప్పారు. 

ఈ వృద్ధిలో ఫాక్స్‌కాన్ భాగంకావాలని భావిస్తున్నదని, భారత్‌తో పాటే తాము వృద్ధిచెందుతామన్నారు. లియు తాజా పర్యటన సందర్భంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ పెట్టుబడులపై చర్చించారు. తదుపరి ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ను కూడా కలిశారు.