13-04-2025 02:06:07 AM
మే 27న బీసీల ధర్మ యుద్ధభేరి
బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్
హైదరాబాద్ బ్యూరో, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడని, రాహుల్‌గాంధీకి వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్ పేరుతో బీసీలను వంచించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే రెండు జీవోలు తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేసేందుకే రెడ్డ కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టి డ్రామాలు ఆడుతున్నారు ఆరోపించారు.
కొందరు బీసీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, సంఘాల నాయకులను అడ్డం పెట్టుకొని బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు, సంఘాల, జెండాలు, అజెండాలను పక్కనపెట్టి మే 27న ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద బీసీల ధర్మ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని రాజారామ్ యాదవ్ పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరి సత్యనారాయణ, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, బీసీ ఫ్రంట్ ప్రెసిడెంట్ పాలూరి రామకృష్ణ, బీసీ అడ్వకేట్ జేఏసీ లోడంగి గోవర్ధన్ యాదవ్, బీసీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకుడు మేకల కృష్ణ, బీసీ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్‌నేత, నాయకులు పాలూరి రామకృష్ణ, వాసుకే యాదవ్, జల్ల నరేందర్‌నేత పాల్గొన్నారు.