calender_icon.png 21 April, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి

27-03-2025 12:00:00 AM

బీసీ బిల్లు అఖిలపక్షం మద్దతుకు కార్యాచరణ

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ బిల్లుకు అఖిలపక్ష మద్దతు కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతం, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకం అన్నారు. బీసీ బిల్లుపై వెంటనే చట్టం చేసి ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలన్నారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు.

జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బిహార్ లో ఇటీవల అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఉద్యోగాలు కూడా భర్తీ చేశారన్నారు. ఆ తరువాత కోర్టులో కేసు వేశారన్నారు. ఇక్కడ కూడా మొదట న్యాయ నిపుణులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. అలాగే ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులని, వీటిని అమ్మకుండా ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు, హాస్టళ్ళకు, స్కూళ్ల నిర్మాణానికి ఉపయోగించాల న్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బీసీ, ఎస్సి, ఎస్టి కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు, పేదలకు ఇండ్లు నిర్మించాలనన్నారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్ ముదిరాజ్, వేముల రామకృష్ణ, అంజి, జెల్ల నరేందర్, సూర్యనారాయణ, అనంతయ్య, రఘుపతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.