- మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు
- మేళా కోసం 4వేల హెక్టార్ల స్థలం కేటాయింపు
- ఈ నెల 13 నుంచి ప్రారంభం
లక్నో, జనవరి 10: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా ‘కుంభమేళా’. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ గంగా, యమున, సరస్వతి సంగమంలో 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మహాకుంభమేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు మేళా జరుగునున్నది. ప్రపంచ నలమూలల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించనున్నట్లు ఓ అంచనా. కుంభమేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4 వేల హెక్టార్ల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ సుమారు 1.50 లక్షల గుడారాలు, 25,000 వసతి గృహాలు ఏర్పాటు చేసింది.
రూ.9 కే భోజనం..
భక్తుల ఆకలి తీర్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మా కి రసోయ్’ పేరుతో రూ.9కే భోజన అందించనున్నది. ‘నంది సేవా సంస్థాన్’ సహకారంతో తఒకేసారి 150 మంది కూర్చుని తినేలా వసతి ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లో సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆహార పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు.