17-04-2025 01:50:45 AM
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరైన శ్రవణ్‌రావు
దాదాపు 5గంటలపాటు విచారించిన అధికారులు
ఆయన ఇచ్చిన ఫోన్‌లలోని సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్న పోలీసులు
మరోసారి విచారణకు పిలిచే అవకాశం..
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు మరోసారి హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆయన విచారణకు హాజరుకావడం ఇది నాలుగోసారి. బుధవారం ఉదయం 11.30గంటల నుంచి దాదాపు 5గంటల పాటు సిట్ అధికారులు ఆయన్ను విచారించారు. గతంలో సిట్ అధికారులకు శ్రవణ్‌రావు ఇచ్చిన మూడు ఫోన్‌లలోని సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఫోన్‌లలో రిట్రీవ్ చేస్తున్న సమాచారం ఆధారంగా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావుకు శ్రవణ్‌రావు ఎవరెవరి ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాపింగ్‌కు పాల్పడ్డారనే అంశంపై మరోసారి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా సుప్రీంకోర్టు ఇంటీరియమ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ మేరకు ఆయన విచారణకు హాజరవుతున్నారని, కానీ దర్యాప్తుకు పూర్తిగా సహకరించడంలేదని తెలుస్తోంది. విచారణలో శ్రవణ్‌రావు నోరు విప్పితే ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
విచారణకు సహకరించాలని ఏప్రిల్ 28వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున మరోసారి శ్రవణ్‌రావు సిట్ విచారణకు హాజరయ్యే ఆస్కారం ఉందని సిట్ అధికారులు చర్చించుకుంటున్నారు. నాట్ టు అరెస్ట్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నందున దాన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో మార్చి 29 నుంచి ఇప్పటివరకు శ్రవణ్‌రావు 4సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9న విచారణ సందర్భంగా దాదాపు 11గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.