calender_icon.png 19 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్త్ సిటీ.. ‘లేదండీ’!

19-03-2025 02:21:03 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ‘ఫోర్ట్ సిటీ.. ఫోర్ట్ సిటీ..’ అంటూ రాష్ట్రప్రభుత్వం ఏడాదిన్నర నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పదే పదే ఫోర్ట్ సిటీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సిటీ ఓఆర్‌ఆర్ అవతల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని ఢంకా బజాయించారు.

అదో పెద్ద గేమ్ చేంజర్ అంటూ బహిరంగ సమావేశాల్లో చొప్పుకొచ్చారు. కానీ.. తాజా పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నది. అందుకు తార్కాణమే మంగళవారం శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ‘హైదరాబాద్‌ను అనుకుని ఫోర్త్ సిటీని రూపొందించే ప్రతిపాదన ఏదైనా ఉందా ? సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయి? ఎంత భూమి అవసరమైంది ? డీపీఆర్ ఏమైనా సిద్ధమైందా ? నోడల్ ఏజెన్సీని ఏమైనా నియమించారా? (ప్రశ్న నంబర్ 4264) అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అందుకు సోమవారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నుంచి ‘లేదండీ’ అని సంక్షిప్త సమాధానం రావడం గమనార్హం. అంతేకాదు.. ఈ సమాధానం ముఖ్యమంత్రి ఆమోదం పొంది, ప్రచురణ రూపంలో రావడం మరో కీలకమైన అంశం.

* “..కులీకుతూబ్ షాహీలు హైదరాబాద్‌ను నిర్మించారు. అది మొదటి నగరం. నిజాం, బ్రిటీషర్లు కలిసి సికింద్రాబాద్‌ను నిర్మించారు.. అది రెండో నగరం. చంద్రబాబునాయుడు, వైస్ రాజశేఖర్‌రెడ్డి కలిసి సైబరాబాద్‌ను నిర్మించారు.. అది మూడో నగరం. ఇప్పుడు నిర్మించబోయేది నాలుగో నగరం.. అదే ఫోర్త్ సిటీ”

8 సెప్టెంబర్ 2024న 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

* “హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పేరిట నిర్మించే ఫోర్త్ సిటీ మున్ముందు న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడుతుంది”

11జనవరి 2025న 

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)  జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

* మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్రప్రభుత్వ సమాధానం ఇది..

ప్రతిపాదనలేవీ లేవంటూ 

స్పష్టం చేసిన సర్కార్

ఫోర్త్‌సిటీ కాదు.. ఫోర్‌బ్రదర్స్ సిటీ

  1. మండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలు
  2. ఇలాంటి మాటలు తగవు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తామని చెప్తున్నది ఫోర్త్ సిటీ కాదని..ఫోర్ బ్రదర్స్ సిటీ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఫ్యూచర్ సిటీపై ఆయన మాట్లాడగా.. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈతరహా వ్యాఖ్యలు చేయడం తగదని హితువు పలికారు.

దీనికి ఎమ్మెల్సీ బదులిస్తూ శాసనసభలో ఇంతకన్నా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, స్వయంగా సీఎం మాట్లాడారని గుర్తుచేశారు. అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టమా? అని ఆయన ప్రశ్నించారు.

వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలుగజేసుకుని.. ఇక్కడ ఓ రూల్..ఓ పద్ధతి ఉందని, దాని ప్రకారమే మాట్లాడాలని సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇది పెద్దల సభ అని, ఆదర్శవంతంగా ఉండాలని, ఈ తరహ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.