శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): వేడి నీళ్లు మీద పడడంతో తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నాలుగేళ్ల బాలుడు శనివారం మృతిచెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. మణికొండ సింహపురి కాలనీలో మైనరాజు అనే వ్యక్తి తన భార్య సోనీ, కుమారుడు ధీరజ్ (4)లతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా ఈనెల 6వ తేదీన రాజు ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిపోగా, రాజు భార్య సోనీ, కుమారుడు ధీరజ్ ఇంట్లో ఉన్నారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీళ్లు వేడి చేసింది. నీళ్లు పూర్తిగా వేడిగా ఉండగా, సోనీ ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది.
అదే సమయంలో ఆడుకుంటూ బకెట్ వద్దకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి ధీరజ్ బకెట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బకెట్ ధీరజ్‌పై ఒరిగి ఒక్కసారిగా వేడి నీళ్లు మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారి ధీరజ్ శరీరం మొత్తం కాలి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ధీరజ్‌కు 60శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ధీరజ్ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనుకోని ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి ధీరజ్ మృతి చెందడంతో రాజు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, మణికొండ సింహపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.